దేవుడి నీడలో కష్టనష్టాలు కనిపిస్తాయా ?

భగవంతుడిని విశ్వసించిన వాళ్లను ... ఆయన నీడలో ఉన్నట్టుగా భావించిన వాళ్లను ఆ దేవదేవుడే రక్షిస్తూ వస్తుంటాడు. తమకి ఉన్నది ... లభిస్తున్నది ఆ భగవంతుడు ప్రసాదించినదేనని భావించిన భక్తులకు ఆయన ఎలాంటి లోటు రానీయకుండా చూస్తుంటాడు.

అలా భగవంతుడిని ధ్యానిస్తూ ... సమస్త జీవులలో ఆయననే చూస్తూ తరించిన భక్తులు ఎంతోమంది వున్నారు. అలాంటి మహాభక్తులలో తుకారామ్ ముందువరుసలో కనిపిస్తాడు. ఒకసారి తుకారమ్ కొద్దిపాటి పొలాన్ని కౌలుకి తీసుకుని దానిని సాగుచేస్తాడు. ఆయన పంటచేలో వందలాది పక్షులు వాలి ధాన్యాన్ని తినసాగాయి.

పక్షులని అదిలించకుండా తుకారామ్ సంతోషంగా చూస్తుండటం ఊళ్లో వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పక్షులను అదిలించమని వాళ్లు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకునేవాడు కాదు. తన పంటను భగవంతుడు వాటికి ఆహారంగా చూపించినప్పుడు అడ్డుపడటం తనవల్ల కాదని సమాధానమిస్తాడు. ఇక తుకారామ్ చేతికి పంటరాదని అంతా అనుకుంటారు. కానీ అందరికన్నా ఆయన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది.

భగవంతుడు పరమ దయామయుడు ... పెట్టే చేతికే సిరిసంపదలు అందేలా చేస్తాడని తుకారామ్ అంటాడు. అలా పండిన పంటలో పేదలకు పంచగా మిగిలిన దానిని మాత్రమే ఆయన తన ఇంటికి చేరుస్తాడు. పంచుకోవడంలో సంతోషం వుంటుంది ... సంతృప్తి ఉంటుంది ... అది ఆ భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుందని చెబుతాడు. అందుకే తుకారామ్ భక్తుల మనసులోనే కాదు, భగవంతుడి హృదయంలోను శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.


More Bhakti News