శని దోష ప్రభావం ఇలా తగ్గుతుంది
శనిదోషం కారణంగా ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి ... మరెన్నో సమస్యలు ఎదురవుతాయి. వాటి బారినుంచి బయటపడటానికి నానాఅవస్థలు పడవలసి వుంటుంది. పరిస్థితులను తలక్రిందులు చేసి .. అన్నిరకాలుగా ఆవేదనకు గురిచేసే శనిదోషాన్ని భరించడం ఎవరి వలనా కాదు.
అందుకే తెలిసినవారి నుంచి సలహాలు ... సూచనలు తీసుకుని శనిదేవుడిని శాంతింపజేయడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా శనిదేవుడి అనుగ్రహాన్ని పొందడానికిగాను 'శని త్రయోదశి'ని మంచి అవకాశంగా వినియోగించుకుంటూ ఉంటారు. శనిదోషం నుంచి ఉపశమనం పొందడం కోసం శని త్రయోదశి రోజున ఏ ప్రయత్నం చేసినా అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పబడుతోంది.
అందువలన జాతకంలో శనిదేవుడి నుంచి ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటున్న వాళ్లంతా, ఈ రోజున ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నంలోనే నిమగ్నమై ఉంటారు. శనిదేవుడి మనసు గెలుచుకోవడానికి ఎన్నో మార్గాలు చెప్పబడుతున్నాయి. రావిచెట్టు కింద దీపం వెలిగించడం అందులో ఒకటిగా కనిపిస్తుంది. ప్రతి శనివారం సాయంత్రం రావిచెట్టుకింద దీపం వెలిగించడం వలన కూడా శనిదోష ప్రభావం తగ్గుతుందని చెప్పబడుతోంది.
దేవతా వృక్షంగా రావిచెట్టు ఆలయ ప్రాంగణంలో పూజలు అందుకుంటూ ఉంటుంది. శనివారం సాయంత్రం వేళలో దైవదర్శనం చేసుకుని రావిచెట్టు కింద దీపం వెలిగించడానికి అవకాశం ఉంటుంది. శని సంబంధమైన దోషంతో బాధపడుతోన్న వాళ్లు రావిచెట్టు కింద దీపం వెలిగించడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.