భక్తుల వెన్నంటి వుండే హనుమంతుడు
నిరంతరం రామనామ స్మరణచేసే హనుమంతుడు, భక్తులను అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. భక్తులు ఇబ్బందుల్లో ఉన్నా ... వాళ్లకి ఎవరైనా అపాయాన్ని తలపెడుతున్నా ఆయన క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతాడు. దుర్మార్గులకు తగినవిధంగా బుద్ధి చెప్పి భక్తులను కాపాడుకుంటాడు. ఇందుకు నిదర్శనంగా ఎన్నో సంఘటనలు కనిపిస్తాయి.
'పోతన' రచించిన భాగవతాన్ని బలవంతంగా పొందాలని సింగభూపాలుడు నిర్ణయించుకుంటాడు. ఆయన ఆదేశం మేరకు భాగవత గ్రంధాన్ని తీసుకువెళ్లడానికి వచ్చిన సైనికులను హనుమంతుడు అడ్డుకుంటాడు ... ఆ ఊరు పొలిమేర దాటేంత వరకూ వాళ్లను తరిమికొడతాడు. ఇక 'త్యాగయ్య' విషయానికి వస్తే ఆయనకి సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన 'స్వరార్ణవం' అనే గ్రంధాన్ని, డబ్బుకి ఆశపడి ఆయన అన్నావదినలే కాజేయాలని చూస్తారు. అలాంటి పరిస్థితుల్లో హనుమంతుడే వచ్చి ఆ గ్రంధం వాళ్ల చేతికి దొరక్కుండా చేసి తగిన విధంగా బుద్ధిచెబుతాడు.
'తులసీదాస్' విషయంలోనూ స్వామి తన మహిమను ప్రత్యక్షంగా చూపించాడు. తులసీదాసు గొప్పతనాన్ని అంగీకరించలేని కొంతమంది దుర్మార్గులు ఆయనపై క్షుద్రశక్తిని ప్రయోగిస్తారు. ఆ క్షుద్రశక్తి వేగంగా ఆయన ఆశ్రమం వైపుకి దూసుకువస్తూ ఉంటుంది. అది ఆశ్రమంలోకి ప్రవేశించబోతున్న తరుణంలో హనుమంతుడు అడ్డుగా నిలుస్తాడు. హనుమంతుడి ముందు నిలువలేని ఆ దుష్టశక్తి తనని ప్రయోగించినవారి వైపే తిరిగి వెళుతుంది.
ఇలా హనుమంతుడు భక్తులను కంటికి రెప్పలా కనిపెట్టుకునే ఉంటాడు. ఆపదలను తరిమికొడుతూ ఆదుకుంటూనే ఉంటాడు. హనుమంతుడిని నమ్ముకున్న వారి వైపు భయం కన్నెత్తి చూడలేదు ... దుఃఖం దరిచేరలేదు. అందుకే అనునిత్యం హనుమంతుడిని పూజించాలి ... ఆయన పాదాలను సదా సేవించాలి.