ఆపదల నుంచి గట్టెక్కించే ఆంజనేయుడు

హనుమంతుడిని పూజించడం వలన అనారోగ్య సమస్యలు ... గ్రహ సంబంధమైన దోషాలు ... తొలగిపోతాయి. హనుమంతుడిని ఆరాధించడం వలన శివకేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. మంగళవారం రోజున ఆ స్వామికి పూజాభిషేకాలు జరిపించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. అందువలన హనుమంతుడి ఆలయాలు భక్తులతో రద్దీగా కనిపిస్తూ ఉంటాయి.

వివిధ ముద్రలతో కొలువైన హనుమంతుడు అనేక విశేషాలతో ... మహిమలతో అలరారుతూ ఉంటాడు. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో 'అమ్మపేట' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఈ గ్రామంలో ఒకవైపున స్వయంభువు వేంకటేశ్వరుడు ... మరోవైపున ప్రాచీన కాలం నాటి శివుడు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఆ రెండు క్షేత్రాలకు మధ్యలో హనుమంతుడి ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది.

చాలాకాలం క్రితం ఈ గ్రామానికి చెందిన ఒక భక్తుడు సంతానలేమి కారణంగా బాధపడుతూ ఉండేవాడట. తనకి సంతానాన్ని ప్రసాదిస్తే స్వామివారికి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడట. అనతికాలంలోనే ఆయన భార్య గర్భాన్ని ధరించి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్న ఆ భక్తుడు ఆయనకి ఆలయాన్ని నిర్మించి తన మొక్కు తీర్చుకున్నాడు. స్వామివారి నిత్య ధూప దీప నైవేద్యాలకు శాశ్వత ఏర్పాట్లు చేశాడు.

ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడి స్వామివారు భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటూనే ఉన్నాడు. కోరిన వరాలను ప్రసాదిస్తూ కొండంత అండగా నిలుస్తూనే ఉన్నాడు. అడిగిన వరాలను ప్రసాదిస్తాడనీ ... ఆపదల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళ .. శనివారాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తూ ఉంటారు. పర్వదినాల్లో ఆ స్వామి సేవకు పూర్తి సమయాన్ని కేటాయిస్తూ, భారీ సంఖ్యలో ఆయన భజనలో పాల్గొని తరిస్తుంటారు.


More Bhakti News