ఈ మాసంలో గిరి ప్రదక్షిణ ఫలితం !

ప్రదక్షిణ వలన దారిద్ర్యము ... దుఃఖాలు దూరమవుతాయని చెప్పబడుతోంది. అందువలన ఆలయ ప్రవేశం చేయగానే భక్తులు కాళ్లు చేతులు శుభ్రపరచుకుని .. తలపై నీళ్లు చల్లుకుని దైవానికి ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక కొన్ని పుణ్యక్షేత్రాలకి వెళ్లినప్పుడు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణచేసే అవకాశం ఉంటుంది.

స్వామివారు కొలువైనది కొండపైనైతే ఆ కొండచుట్టూ ప్రదక్షిణచేసే సంప్రదాయం కనిపిస్తుంది.సాధారణ ప్రదక్షిణలకి కొంత సమయమే పడుతుంది. ఇక గిరి ప్రదక్షిణకైతే ఎక్కువ సమయమం తీసుకుంటుంది. విశేషమైన రోజుల్లో చేసే గిరి ప్రదక్షిణ వలన వచ్చే ఫలితం కూడా విశేషంగానే ఉంటుందని అంటారు. అందువల్లనే పర్వదినాల్లో గిరి ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.

ఆధ్యాత్మిక వాతావరణంలో ... ఎక్కువ సంఖ్యలో గల భక్తులతో కలిసి సందడిగా గిరి ప్రదక్షిణ చేయడం వలన అలసట తెలియదు. ఇలా భక్తులచే గిరి ప్రదక్షిణలు అందుకునే క్షేత్రాల్లో 'అరుణాచలం' ఒకటిగా కనిపిస్తుంది. ఈ కొండపై అరుణాచలేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ కొండచుట్టూ ప్రదక్షిణచేసే మార్గం 13 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది.

ఈ మార్గంలో అష్టదిక్పాలకుల పేర్లతో ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు కొలువుదీరి ఉంటాయి. వీటిని దర్శించుకుంటూ ప్రదక్షిణ చేయడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. కార్తీకమాసంలో ఇక్కడ జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని చూసితీరవలసిందే. కార్తీకమాసంతో పాటు మార్గశిరమాసం కూడా ఇక్కడి గిరి ప్రదక్షిణకు విశేషమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో గిరి ప్రదక్షిణ చేయడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తజనులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News