ఇప్పటికీ రాధాకృష్ణులు ఇక్కడికి వస్తారట !
బృందావనం చేరుకుంటే రాధాకృష్ణుల రసమయ జగత్తులోకి అడుగుపెట్టిన అనుభూతే కలుగుతుంది. ఇక్కడ రాధాకృష్ణులు ఆడినచోటు ... పాడినచోటు ... అల్లరిచేస్తూ పరుగులు తీసినచోటు ... కలిసి కబుర్లు చెప్పుకున్నచోటు ... ఒకరి అలకను ఒకరు తీర్చినచోటు ... ఇలా ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. రాధాకృష్ణుల కాలంనాటి రసమయ దృశ్యాలను కనులముందు అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటాయి.
రాధాకృష్ణుల జ్ఞాపకాలను అందంగా ఆవిష్కరించే ఈ ప్రదేశాలను ఎంతసేపైనా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించే ఇక్కడి ప్రదేశాల్లో ఒకటిగా 'సేవాకుంజ్' కనిపిస్తుంది. ఈ ప్రదేశాన్ని రాధాకృష్ణులు తమదైన ప్రపంచంగా భావించేవారట. ఇక్కడ కలుసుకుని ఆడుతూ పాడుతూ పరవశించిపోయేవాళ్లు. రాధాకృష్ణుల అలకలకు ... బుజ్జగింపులకు ...రాధకు కృష్ణుడు చేసే సేవలకు ఈ ప్రదేశం వేదికగా కనిపిస్తుంది.
విశేషమేవిటంటే ఇప్పటికీ రాత్రివేళలో రాధాకృష్ణులు ఈ ప్రదేశానికి వస్తారని ఇక్కడివాళ్లు బలంగా నమ్ముతుంటారు. రాధాకృష్ణుల ఏకాంతానికి తాము భంగంకలిగించకూడదనే ఉద్దేశంతో ఈ ప్రదేశంలో లేకుండా వెళ్లిపోతుంటారు. రాధాకృష్ణుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశంలో ఉన్నామనే ఆలోచన ఎంతటి ఆనందాన్ని కలిగిస్తుందో, వాళ్ల మనసుకి నచ్చిన ఈ ప్రదేశాన్ని వదలి వచ్చేటప్పుడు అంతటి బాధకలుగుతుంది. ఒకసారి బృందావం వెళ్లివచ్చిన వాళ్లు రాధాకృష్ణుల ప్రతిమను కొనుక్కోకుండా ఉండలేరు ... ఆ ప్రేమమూర్తులను పూజించకుండా ఉండనూ లేరు.