శివపార్వతుల ఆరాధనా ఫలితం !
సమస్తమైనటు వంటి ఈ విశ్వం ఎవరిచేత రక్షించబడుతూ వుందో ... ఎవరు సమస్త జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నారో వారే శివపార్వతులు. ఈ జగత్తుకు తల్లిదండ్రులుగా అందరూ వారినే భావిస్తూ ఉంటారు. అనునిత్యం ఆదిదంపతులను పూజిస్తూ ... సేవిస్తూ తరిస్తుంటారు.
భక్తులను తరింపజేయడం కోసమే శివపార్వతులు అనేక ప్రాంతాలలో ఆవిర్భవించారు. అలా వాళ్లు కొలువుదీరిన ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. వివిధ శైవక్షేత్రాల్లో ఆదిదేవుడు ... అమ్మవారు అనేక నామాలతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. స్వామివారు లింగరూపంలోనూ ... అమ్మవారు విగ్రహ రూపంలోనూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు.
దర్శనమాత్రం చేతనే శివపార్వతులు పాపాలను నశింపజేసి శుభాలను ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు. వారి నమ్మకానికి తగినట్టుగానే ఆయురారోగ్యాలను ... అష్టైశ్వర్యాలను ... సంతాన సౌభాగ్యాలను వరాలుగా పొందుతున్నారు. సాధారణంగా స్త్రీలు ఆచరించే నోములు ... వ్రతాలలో ఎక్కువ భాగం శివపార్వతుల నేపథ్యంగానే కొనసాగుతుంటాయి.
ఇక వివాహం విషయంలో వివిధ కారణాల వలన జరుగుతోన్న ఆలస్యానికి కొంతమంది ఎంతగానో బాధపడుతుంటారు. అలాంటివారు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తూ ఉండటం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి సోమవారం పార్వతీ పరమేశ్వరుల ఆలయాన్ని దర్శించడం, స్వామివారికి అభిషేకం ... అమ్మవారికి అలంకారం భక్తిశ్రద్ధలతో జరిపించాలి. వీలైతే ఆలయానికి సంబంధించిన ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.
భగవంతుడికి సంబంధించిన ప్రతి సేవను అంకితభావంతో ఆచరించాలి. భగవంతుడు సేవకి మాత్రమే సంతోషిస్తాడు ... సేవకి మాత్రమే సంతృప్తి చెందుతాడు. అందువలన పూజాభిషేకాలతో పాటు దేవుడి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన పార్వతీ పరమేశ్వరులు ప్రీతిచెందుతారు. ఫలితంగా వివాహానికి అడ్డుపడుతోన్న దోషాలు తొలగిపోతాయి. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో అనతికాలంలోనే వివాహం జరుగుతుందని చెప్పబడుతోంది.