శుభాన్ని సూచించే శంఖధ్వని !
ఎవరైనా ఏదైనా ఒక ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లాలనుకున్నప్పుడు శుభ శకునం చూసుకుని బయలుదేరుతుంటారు. శకునం మంచిదైతే అనుకున్న కార్యం సిద్ధిస్తుందనీ, లేదంటే అవాంతరాలు ఎదురవుతాయనే విశ్వాసం పూర్వకాలం నుంచి ఉంది. అందువలన కొన్ని శుభ శకునాలు చూసుకునే అడుగుబయటికి పెట్టడం చేస్తుంటారు.
సాధారణంగా ఏదైనా శుభకార్యం నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు గుడిలో నుంచి గంటల శబ్దం వినిపించినా ... మంగళవాద్యం వినిపించినా అది శుభప్రదమైనదిగా భావించి వెంటనే బయలుదేరుతుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని మార్లు 'శంఖధ్వని' కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో బయల్దేరవచ్చా .. లేదా ? అనే సంశయం కొంతమందికి కలుగుతుంటుంది.
ముఖ్యమైన పనిపై బయలుదేరుతున్నప్పుడు శంఖధ్వని వినిపిస్తే దానిని మంగళప్రదమైనదిగా భావించవచ్చని చెప్పబడుతోంది. శంఖం లక్ష్మీదేవి స్థానంగా చెప్పబడుతోంది. శ్రీమహావిష్ణువు సదా చక్రంతో పాటు శంఖాన్ని ధరించి దర్శనమిస్తుంటాడు. పూజా మందిరంలో శంఖం ఉండటం వలన ... శంఖాన్ని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. నీరు శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని చెప్పబడుతోందంటే శంఖానికి గల ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రాచీనకాలంలో శంఖాలకి గల ప్రాధాన్యత ... వాటి వాడకం మరింత ఎక్కువగా ఉండేది. ఇప్పటికీ చాలా క్షేత్రాల్లో శంఖంలోని నీటితోనే దైవానికి అభిషేకాలు జరుపుతుంటారు. ఇలా ఎంతో పవిత్రతను సంతరించుకున్నదిగా శంఖం కనిపిస్తుంది. అలాంటి శంఖం కనిపించినా ... దాని ధ్వని వినిపించినా శుభప్రదమేనని చెప్పబడుతోంది. శంఖధ్వనిని మంగళప్రదమైనదిగా భావించి బయలుదేరవచ్చని స్పష్టం చేయబడుతోంది.