మనసును కట్టిపడేసే మహాదేవుడి క్షేత్రం
తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధిచెందినటువంటి శైవక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. కాకతీయుల కాలానికి చెందినవిగా కొన్ని ... అంతకు పూర్వానిగా మరికొన్ని కనిపిస్తుంటాయి. కాకతీయులు తమ పరిపాలనా కాలంలో వివిధ ప్రాంతాలలో ఎన్నో శివాలయాలను నిర్మించారు. అలాగే తమకంటే ముందున నిర్మించబడిన ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషిచేశారు.
అలా కాకతీయుల కాలంలో వైభవంగా వెలుగొందిన శైవక్షేత్రాల్లో ఒకటి 'ఉరుమడ్ల' లో అలరారుతోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో భారీనిర్మాణంగా ఈ ఆలయం కనిపిస్తుంది. ఎత్తయిన గోపురాలు ... పొడవైన ప్రాకారాలతో ఈ ఆలయం ప్రాచీన వైభవాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది.
ఈ గ్రామంలో ఇంతటి అద్భుతమైన క్షేత్రం ఉందా ? అంటూ ఆశ్చర్యచకితులు కాని భక్తులు ఉండరు. ఇక్కడ అడుగుపెట్టగానే ఎంతోమంది మహనీయుల పాదస్పర్శ వలన ఈ క్షేత్రం మరింత పవిత్రమైందనే విషయం అర్థమవుతుంది. ఈ ఆలయానికి సంబంధించిన పౌరాణిక నేపథ్యం ... చారిత్రక వైభవం గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తుంటాయి. మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం నుంచి వెనుదిరగడానికి ఒక పట్టాన మనసొప్పదు.
ఇక్కడి రామలింగేశ్వరుడుని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. ఆ స్వామి అనుగ్రహమే తమకి సుఖసంతోషాలను ప్రసాదిస్తోందని విశ్వసిస్తుంటారు. సోమవారాల్లోను ... పర్వదినాల్లోను స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. పరమశివుడి దర్శనంతో ... ఆయన నామస్మరణతో తరిస్తుంటారు. దర్శనమాత్రం చేతనే మనసునుకట్టిపడేసే ఈ క్షేత్రాన్ని చూసితీరవలసిందే.