స్వామివారిని శాంతింపజేసిన అమ్మవారు !
అహోబిల నరసింహస్వామివారి సన్నిధికి దగ్గరలో చెంచులక్ష్మీ ఆలయం దర్శనమిస్తుంది. భక్తులు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆ తల్లి కరుణాకటాక్ష వీక్షణాలను కోరుతూ ప్రార్ధిస్తుంటారు. ఉగ్రమూర్తి అయిన స్వామివారిని శాంతింపజేయడం కోసం లక్ష్మీదేవియే చెంచులక్ష్మిగా జన్మించిందని అంటారు.
ఒకసారి లక్ష్మీనారాయణులు భూలోక విహారానికి వచ్చినప్పుడు అమ్మవారు ఒక మామిడికాయలో తన 'కళ' నుంచి వెళుతుంది. ఆ మామిడిపండు తిన్న ఒక చెంచుస్త్రీ పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. అడవిలో ఆడుతూ పాడుతూ తిరుగుతూ పెద్దదవుతుంది. ఈ నేపథ్యంలో హరినామస్మరణ మానుకోమంటూ ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ఎన్నో చిత్రహింసలకు గురిచేస్తుంటాడు.
తన సహనాన్ని పరీక్షించిన కారణంగా స్వామి ఉగ్రనారసింహుడుగా అవతరించి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆగ్రహావేశాలను తట్టుకోలేక స్వామి ఈ ప్రదేశంలో తిరుగుతూ వుండగా 'చెంచులక్ష్మీ' తారసపడుతుంది. ఇంద్రాది దేవతలు ... మహర్షులు సైతం ఆ పరిస్థితుల్లో ఆయన సమీపానికి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో స్వామివారి చెంతకు చేరిన చెంచులక్ష్మీ ఆయనని శాంతింపజేస్తుంది.
అలా చెంచులక్ష్మీ ఆయన మనసు గెలుచుకుని వివాహం చేసుకుందని అంటారు. చెంచుల కుటుంబంలో అమ్మవారు జన్మించిన కారణంగా, ఇక్కడి చెంచులు స్వామివారిపట్ల ... అమ్మవారిపట్ల ఎంతో ప్రేమానురాగాలను కలిగి ఉంటారు. తమదైన పద్ధతిలో ప్రత్యేక పూజలు జరిపిస్తూ ... నైవేద్యాలు సమర్పిస్తూ సంతోషంతో పొంగిపోతుంటారు.