అలా ఆమె మనసు కుదుటపడుతుంది !
ద్రుపద మహారాజు కూతురైన ద్రౌపది స్వయంవరానికి అర్జునుడు హాజరవుతాడు. స్వయంవర పరీక్షలో 'మత్స్యయంత్రం' ఛేదించి ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు. ద్రౌపదిని వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువస్తాడు. ఆ సమయంలో కుంతీదేవి లోపల ఏదో పనిలో ఉంటుంది.
ద్రౌపదితో వాకిట్లో నిలిచిన అర్జునుడు, తాను ఒక కానుకను తీసుకువచ్చానని తల్లితో చెబుతాడు. తెచ్చినది ఏదైనా అది అన్నదమ్ములందరికీ చెందుతుందంటూ ఆమె బయటికివస్తుంది. అర్జునుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని ఉండటం చూస్తుంది. విషయం తెలుసుకుని ... ఎంతగానో బాధపడుతుంది. పరమాత్ముడైన కృష్ణుడితో పంచుకుంటే తప్ప తన బాధ తీరదని భావించిన కుంతీదేవి ఆయనని తలచుకుంటుంది.
దాంతో శ్రీకృష్ణుడు ఆమె ఎదుట ప్రత్యక్షమవుతాడు. జరిగిన సంఘటన గురించి కుంతీదేవి ఆయనకి వివరిస్తుంది. తన నోటి నుంచి వెలువడిన మాటకు పాండవులు కట్టుబడి ఉంటారనీ, అయితే అర్జునుడు తీసుకువచ్చినది ద్రౌపదిననే విషయం తెలియక తాను అలా అన్నానని చెబుతుంది. ద్రౌపది అయిదుగురికి భార్యగా ఉండటం ధర్మంకాదు కనుక, ఈ విషయంలో ఏంచేయాలో తోచడంలేదని ఆవేదనను వ్యక్తం చేస్తుంది.
కారణం లేకుండా ఆమె నోటి వెంట ఆ మాట వెలువడలేదని చెబుతాడు కృష్ణుడు. పాండవులకు ద్రౌపది భార్యగా ఉండవలసి రావడంలో కుంతీదేవి ప్రమేయం ఎంతమాత్రం లేదని అంటాడు. ద్రౌపది కారణజన్మురాలని చెబుతాడు. పాండవులు ఎవరో ... ద్రౌపది ఎవరో ... వాళ్లందరికీ ఆమె ఎందుకు భార్యగా ఉండవలసి వచ్చిందో ... అలా ఉండటం తప్పుకాకపోవడానికి గల కారణమేమిటో వివరిస్తాడు. అలా జరగవలసి వుంది కనుకనే జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తాడు. అప్పటి వరకూ తన వలన పొరపాటు జరిగిందనుకుని బాధపడుతోన్న కుంతీదేవికి కృష్ణుడి మాటలతో మనసు కుదుటపడుతుంది.