భగవంతుడి పాదాలపైనే దృష్టి నిలపాలి

చిత్తం శివుడి మీద ... భక్తి చెప్పుల మీద అనే నానుడి చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. గుడి బయట చెప్పులు విప్పి దైవదర్శనానికి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. లోపలికి వెళ్లినది మొదలు, బయట విప్పిన చెప్పులు ఉన్నాయో ... ఎవరైనా ఎత్తుకెళ్ళారోననే ఆలోచన మనసును స్థిమితంగా ఉండనీయదు ... భగవంతుడి పాదాలపై దృష్టి నిలపనీయదు.

ఇక గుడి బయట వాహనాలు నిలిపి వచ్చే కొందరిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. తమది అనబడే వస్తువు తమకి దూరమైపోతుందేమోననే ఆందోళన భగవంతుడిపై మనసుపెట్టకుండా చేస్తుంటుంది. తాత్కాలికమైనవాటి కోసం శాశ్వతమైనటు వంటి భగవంతుడి పాదాలకు దూరం చేస్తుంది. ఏదీ తమది కాదు ... అది శాశ్వతము కాదు అనే భావనతోనే మహానుభావులు నడచుకున్నారు.

పురందరదాసు అన్నింటినీ వదిలి భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడి నామాన్ని చెబుతూ అడవిలో ముందుకుసాగుతూ వుంటాడు. వెండిచెంబుతో మంచినీళ్లు పట్టుకుని ఆయనిని అనుసరిస్తోన్న భార్య, తామెంతో ముచ్చటపడి కొనుక్కున్న వెండిచెంబు కూడా దారిదోపిడి దొంగల పాలవుతుందేమోనని భయపడుతూ ఉంటుంది. భగవంతుడి నామాన్ని భార్య చెప్పక పోవడానికి గల కారణాన్ని గ్రహించిన పురందరదాసు ఆ వెండిచెంబును దూరంగా పారేస్తాడు.

అలాగే మహాభక్తుడైన తుకారామ్ కొంతమంది స్వార్థపరుల కారణంగా సొంత ఇంటికి దూరం కావలసి వస్తుంది. అయితే ఆ ఇంటిని అపురూపంగా చూసుకుంటూ వచ్చిన జిజియా, దానిని వదులుకోవడానికి ఎంతగానో బాధపడుతుంది. అశాశ్వతమైనవాటిని పట్టుకుని అవి తమతో పాటు ఎప్పటికీ ఉంటాయని అనుకోవడమే దుఃఖానికి కారణమవుతుందనీ, ఆ ఇష్టాన్ని భగవంతుడి పై పెంచుకుంటే ఆ సంతోషం శాశ్వతంగా నిలుస్తుందని తుకారామ్ చెబుతాడు. దాంతో మౌనంగా ఆమె తన భర్తవెంట నడుస్తుంది.

ఇలా ఎంతోమంది మహానుభావులు తామరాకుపై నీటిబొట్టులా ఉండమని చెప్పారేగానీ, దేనిపైనా విపరీతమైన వ్యామోహాన్నీ ... మమకారాన్ని పెంచుకోమని చెప్పలేదు. అలా పెంచుకుంటే జీవితం బాధలకు దగ్గరై భగవంతుడి సేవకు దూరమవుతుందనే సెలవిచ్చారు.


More Bhakti News