శని త్రయోదశి రోజున శివపూజ !

శని పట్టడమంటూ జరిగితే ఒక పట్టాన వదిలిపెట్టడని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. జీవితంలో కష్టాలను ఎదుర్కునే సామర్థ్యాన్ని కలిగించడం కోసమే ఆయన ఇలా చేస్తుంటాడని మరికొందరు అంటుంటారు. అయితే ఆ కష్టాలను తట్టుకోవడం ఎంత కష్టమనే విషయం వాటిని ఎదుర్కుంటోన్నవాళ్లకే తెలుస్తుంది.

వైభవాన్ని కోల్పోవడం ... సుఖసంతోషాలకు దూరం కావడం ... ఎవరూ కోరుకోరు. అందువలన శనిదోషం అనే మాట వినగానే అంతా ఆందోళన చెందుతుంటారు. సాధ్యమైనంత తొందరగా ఆయన బారినుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. శని సంబంధమైన క్షేత్రాలను దర్శించి అక్కడ పూజాభిషేకాలు జరిపిస్తుంటారు.

శనిదేవుడి మనసు గెలుచుకుని ఆయనని శాంతింపజేయాలనుకునేవారికి 'శని త్రయోదశి' ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ రోజున చేసే పూజాభిషేకాలు ఇచ్చే విశేష ఫలితాల వలన ఆయన సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని అంటారు. అందువలన ఈ రోజున శని సంబంధమైన క్షేత్రాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.

సాధారణంగా శనిత్రయోదశి సందర్భంగా ఆయనకి మాత్రమే పూజాభిషేకాలు జరిపిస్తుంటారు. అయితే ఈ రోజున శివుడిని కూడా పూజించాలని చెప్పబడుతోంది. పరమశివుడిని ఆరాధించి శనీశ్వరుడికి పూజాభిషేకాలు జరిపించడం వలన మాత్రమే పరిపూర్ణమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది. కనుక శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని మాత్రమే కాకుండా ఈశ్వరుడిని కూడా పూజించడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయి.


More Bhakti News