అమ్మవారే స్వయంగా పూలు కోస్తుందట !
అమ్మవారికి సంబంధించిన కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ అమ్మవారు ముత్తయిదువుగా వృద్ధురాలి రూపంలో తిరుగుతూ ఉంటుందనే కథనాలు వినిపిస్తూ ఉంటాయి. భక్తుల అనుభవాలుగా వినిపించే ఆసక్తికరమైన ఈ కథనాలు ఆ క్షేత్రాల్లో అమ్మవారు ప్రత్యక్షంగా కొలువై ఉందనే విశ్వాసానికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
అలా అమ్మవారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం 'శ్రీవారిజాల వేణుగోపాలస్వామి' క్షేత్రంలో వినిపిస్తుంది. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం 'గోపలాయపల్లి' పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి కొండపై వేణుగోపాలస్వామి స్వయంభువుగా ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఈ ఆలయం నుంచి ఇంకాస్త కొండపైకి వెళితే అక్కడ స్వయంభువుగా వెలసిన 'ఇష్టకామేశ్వరీ దేవి' దర్శనమిస్తుంది. పెద్ద బండరాళ్ల మధ్య వెలసిన అమ్మవారి రూపం భక్తులకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే స్వయంభువుగా చెప్పబడుతోన్న అయిదు శివలింగాలు దర్శనమిస్తూ ఉంటాయి.
అమ్మవారికి ఎదురుగా సహజసిద్ధమైన కొలను కనిపిస్తుంది. ఈ కొలనులో కలువపూలు కనువిందు చేస్తుంటాయి. అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో ఈ కొలను దగ్గర కాలికి గజ్జెలు కట్టుకుని నడుస్తున్న ధ్వని వినిపిస్తూ ఉంటుందట. అలా గజ్జెల చప్పుడు వినిపించిన కాసేపటికి కొలనులో నుంచి కొన్ని కలువలు అదృశ్యమవుతాయట. దాంతో అమ్మవారే తనకి ఎంతో ఇష్టమైన ఆ కలువలను కోస్తుందని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. చూడటానికి ఎంతో అందంగా కనిపించే ఈ కోనేరు మహా లోతైనదని చెబుతుంటారు.
ఇంతటి ఎత్తయిన కొండపై ఇష్టకామేశ్వరీ దేవి ఆవిర్భవించడం ... ఆ తల్లి ఎదురుగా సహజసిద్ధమైన కోనేరు ఉండటం ... దీనిలోని నీళ్లు ఎండిపోవడమనేది ఇంతవరకూ జరగకపోవడం ... అందులోని కలువలు మాయమవుతుండటం కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. సకలశుభాలను ప్రసాదించే ఆ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతుంటారు.