ఇలా కూడా భగవంతుడు స్వీకరిస్తాడు
పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రధాన దైవాన్ని దర్శించినప్పుడు మనసు పరవశించిపోతుంది. వివిధరకాల పూలమాలికలతో ... ఖరీదైన ఆభరణాలతో స్వామివారు అలంకరించబడి అందంగా దర్శనమిస్తూ ఉంటాడు. వజ్రాలు పొదిగిన కిరీటం ... బంగారు కవచం ... రత్నాల హారాలతో స్వామి వైభవంగా వెలుగొందుతూ ఉంటాడు.
కనుల పండువగా స్వామి అలా కనిపిస్తూ వుంటే ఒక వైపున ఆనందం కలుగుతుంది. మరో వైపున స్వామికి ఏమీ సమర్పించలేకపోయామనే బాధకలుగుతూ ఉంటుంది. భగవంతుడి పట్ల గల ప్రేమని కూడా చాటుకోనీయని పేదరికంపట్ల అసహనం కలుగుతుంది. వీలైనంత వరకూ ఖర్చు తగ్గించుకుని అలా కూడబెట్టిన మొత్తంతో ఆ స్వామికి ఏదో ఒక ఆభరణం చేయించి ఇవ్వాలనిపిస్తుంది.
ఇక అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన దగ్గర నుంచి ఆ స్వామికి కానుకను ఇచ్చేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయడం మొదలవుతుంది. భగవంతుడికి కానుకను సమర్పించాలనే ఆలోచన మంచిదే. అయితే అందుకు అవకాశం లేకపోతే బాధపడవలసిన పనిలేదు. భగవంతుడు వివిధ రకాల అలంకరణలతో కనిపించేది తన వైభవాన్ని చాటుకోవడానికి కాదు ... భక్తుల ముచ్చట తీర్చడం కోసమే.
స్థోమతలేని కారణంగా ఆ స్వామికి ఏమీ ఇవ్వలేకపోయామని బాధపడవద్దు. స్వామివారికి వివిధరకాల పూల మాలలను సమర్పిస్తున్నట్టుగా మనసులో అనుకోవచ్చు. అలాగే ఆయనకి ఖరీదైన ఆభరణాలను సమర్పిస్తున్నట్టుగా అనుకోవచ్చు. మనసులోని సంకల్పం బలమైనదే అయితే తప్పనిసరిగా ఆ పూల మాలలు ... ఆభరణాలు ... ఇతర కానుకలు ఏవైనా ఆ స్వామి తప్పకుండా స్వీకరిస్తాడని చెప్పబడుతోంది.
ఇందుకు నిదర్శనంగా మహాభక్తుల జీవితంలోని కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. మనసు నిండా స్వామివారి రూపం ... ఆయనపట్ల అసమానమైన భక్తి ఉండాలే గానీ, ఎక్కడ నుంచైనా ఎలాంటి కానుకనైనా భగవంతుడికి మానసికంగా సమర్పించుకోవచ్చు ... ఆ స్వామి కృపాకటాక్షాలకు పాత్రులు కావొచ్చు.