నరసింహస్వామి ఆరాధనా ఫలితం !

సాధారణంగా గుట్టలపైనా ... గుహల్లోనూ నరసింహస్వామి ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలా స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రదేశాలు అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. నరసింహస్వామి అవతరించినదే తన భక్తుడైన ప్రహ్లాదుడి మాటను నిజం చేయడం కోసం, తనని ఆరాధించే భక్తులను అనుగ్రహిచడం కోసం.

అందువలన స్వామివారు ఉగ్రమూర్తిగా దర్శనమిస్తున్నా భక్తులు ఆయనని దర్శిస్తూనే ఉంటారు ... సేవిస్తూనే ఉంటారు. భక్తులను బాధించేవారి విషయంలో ఉగ్రత్వాన్ని కనబరిచే స్వామి, తన భక్తులను చల్లనిమనసుతో అనుగ్రహిస్తూ ఉంటాడని విశ్వసిస్తూ ఉంటారు. అలాంటి నరసింహస్వామి చిత్రపటం ఇంట్లో ఉంటే ఎలాంటి దుష్టశక్తులు లోపలికి ప్రవేశించవు.

నరసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలు ఎంతో ప్రత్యేకతను ... మరెంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. అక్కడ స్వామివారు వెలసిన తీరు గురించి, ఆయన అనుగ్రహం విషయంలో భక్తులు పొందుతోన్న అనుభవాలను గురించి ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ ఉంటాయి. నరసింహస్వామి క్షేత్రాలను దర్శించడం వలన, ఆ స్వామి సన్నిధిలో నిద్రచేయడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నరసింహస్వామిని భక్తిశ్రద్ధలతో నిత్యం పూజించడం వలన శత్రువులపై విజయం చేకూరుతుంది. తలపెట్టిన కార్యాలు సఫలీకృతమై సిరిసంపదలు చేకూరతాయి.

రాహు సంబంధమైన ... కేతు సంబంధమైన దోషాలు గల వాళ్లు నరసింహస్వామిని పూజిస్తూ ఉండటం వలన, ఆ దోషాల ప్రభావం వలన కలిగే బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. నరసింహస్వామిని అంకితభావంతో పూజిస్తూ ఉండటం వలన ఆపదలు ... అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు ... శత్రు భయాలు ... గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోయి, సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News