బాధలు తొలగించే బంధువే బాబా

శిరిడీసాయి ప్రేమతత్త్వం కేవలం ఆ గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదు. అనుగ్రహంగా ఆయన చూపిన మహిమలు అక్కడివారి అనుభవానికి మాత్రమే పరిమితం కాలేదు. బాబా కరుణా కటాక్ష వీక్షణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసరించాయి. ఆయన సేవని విశ్వసించినవారి వంశాలు తరించాయి. కష్టమొచ్చినా ... నష్టమొచ్చినా బాబా ఉన్నాడనే ధైర్యంతో ప్రశాంతంగా ఆయన ముందు కూర్చునే భక్తులు ఎంతోమంది ఉన్నారు.

బలమైన ఆ విశ్వాసానికి ప్రతీకగా అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. బాబాను అనునిత్యం దర్శించుకోవాలి ... అంకితభావంతో ఆయనని సేవించుకోవాలనే భక్తుల సంకల్పం కారణంగా ఈ ఆలయాల నిర్మాణం జరిగింది. బాబా ఆలయాలు ఎక్కడ ఉన్నా ప్రతి గురువారం అవి భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

గురువారం రోజున బాబా అభిషేకంలో పాలుపంచుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివిధరకాల పుష్పమాలికలను బాబాకు సమర్పించి ఆయనని కనులారా చూసుకుని మురిసిపోయే భక్తులు ఎంతోమంది కనిపిస్తుంటారు. బాబా హారతులు ... భజనలు ... పారాయణాలతో ఆయన ఆలయాలు భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. అలాంటి బాబా ఆలయాలలో ఒకటి మనకి కృష్ణాజిల్లా 'నందిగామ' లో కనిపిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతను ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక్కడి బాబాను పూజిస్తేచాలు బాధలన్నీ తొలగిపోతాయని భక్తులు భావిస్తుంటారు. ఆయనని నమ్ముకున్న వాళ్లందరి జీవితాలు సంతోషకరంగా ... సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతుంటారు. తాము తలపెట్టే ప్రతి కార్యానికి ముందు ఆయన ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు. తమకి చేకూరుతోన్న సమస్త విజయాలకు ... సకల శుభాలకు ఆయనే కారకుడనే ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News