ఆరోగ్యాన్ని ప్రసాదించే సాయిబాబా

బాబాకి మించిన వైద్యుడు లేడు ... విభూతికి మించిన ఔషధం లేదని శిరిడీ ప్రజలు భావిస్తూ ఉండేవాళ్లు. బాబా ఉండగా తమకి భయాలు అవసరం లేదని భావించేవాళ్లు. వివిధరకాల వ్యాధులతో బాధలుపడుతోన్నవాళ్లు బాబా దగ్గరికి ఎక్కువగా వచ్చేవాళ్లు.

చాలా వ్యాధులకు బాబా విభూతినే ఔషధంగా ఇచ్చేవాడు. ఆ విభూతి మహిమ కారణంగానే వ్యాధులు నివారించబడుతూ ఉండేవి. అయితే కొంతమందికి బాబా పథ్యం కూడా చెప్పేవాడు. తాను చెప్పిన పథ్యం పాటించడం వలన వ్యాధి త్వరగా నయమవుతుందని అనేవాడు. అయితే కొంతమంది పథ్యం చేయకుండా వ్యాధిని మరింత ఎక్కువ చేసుకుంటూ ఉండేవారు.

అలాంటివారికి హాని చేసే పదార్థాలు దొరక్కుండా చేసి, తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు పథ్యం పాటించేలా బాబా చేసేవాడు. మరికొంత మంది పథ్యానికి అవసరమైన వస్తువులు లభించక ఇబ్బంది పడుతుంటే, సాయపడుతున్నది తాననే విషయం తెలుయకుండగా వాటిన బాబా సమకూర్చేవాడు. ఇలా తన దగ్గరికి అనారోగ్యంతో వచ్చిన వాళ్లకి పూర్తి ఆరోగ్యం చేకూరే వరకు బాబా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉండేవాడు.

పథ్యానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లభించనివి ... కాలంగాని కాలంలో కనిపించనవి కూడా తనని విశ్వసించినవారి కోసం బాబా సమకూర్చిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా బాబాపట్ల విశ్వాసంతో ఆయన విభూతిని ఉపయోగించేవాళ్లు ... స్వప్నంలో బాబా చెప్పాడంటూ పథ్యాన్ని పాటించేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. తమ అనుభవాలుగా ఆయన మహిమలను గురించి చెబుతూనే ఉంటారు.


More Bhakti News