ప్రేమస్వరూపమే శిరిడీ సాయి
ప్రేమతత్త్వాన్నీ... సమానత్వాన్ని ఈ లోకానికి చాటిన మహానుభావుడిగా శిరిడీ సాయిబాబా కనిపిస్తాడు. ఆయన అందరినీ సమానంగా ఆదరించేవాడు ... ఆదుకునేవాడు. ఆయన పలకరింపులో ఆప్యాయతానురాగాలు ఉట్టిపడేవి. ఆయన దర్శనమాత్రంచేతనే పరిస్థితులు చక్కబడతాయని అంతా భావించేవాళ్లు.
అర్హతనుబట్టి అనుగ్రహించడం తప్ప ఆయన ఎవరినుంచి ఏమీ ఆశించేవాడు కాదు. కృతజ్ఞతా పూర్వకంగా ఎంతోమంది ఆయనకి వివిధరకాల బహుమానాలు ... కానుకలు తీసుకుని వచ్చేవాళ్లు. కానీ వాటిని ఆయన సున్నితంగా తిరస్కరించేవాడు. ఇక అహంభావం కలిగినవాళ్లు ఏదైనా తీసుకువస్తే కనీసం వాటిని అక్కడ పెట్టనిచ్చేవాడు కాదు.
కొంతమంది బాబాకి కొత్త వస్త్రాలను ఇచ్చినా ఆయన వాటిని ధరించకుండా పాత వస్త్రాలనే ముల్లుతో కుట్టుకుని ధరించేవాడు. బాబా కొత్తవస్త్రాలను ధరించవలసిందేననీ, లేదంటే తాను భోజనం చేయనని ఒకసారి తాత్యా పట్టుపడతాడు. ఈ విషయంలో బాబా ఎంతగా నచ్చజెప్పినా ఆయన వినిపించుకోడు. మిగతా విషయాల్లో బాబా ఒక యోగిలా ... మహాజ్ఞానిలా కనిపించినా, ప్రేమానురాగాల విషయంలో ఆయన ఒక సాధారణమైన వ్యక్తిలానే ప్రవర్తించేవాడు.
అలగడమే కాదు అలకతీర్చడం కూడా బాబాకి బాగాతెలుసు. తాత్యా మనసుకు కష్టం కలిగించడం ఇష్టంలేక బాబా కొత్తవస్త్రాలను ధరిస్తాడు. ఆయనని చూసి తాత్య ఆనందిస్తూ ఉంటే, ఆ సంతోషాన్ని చూసి బాబా సంతృప్తి చెందుతాడు. తాత్యాకి దగ్గరుండి భోజనం తినిపించి అతని ఆకలి తీరుస్తాడు. తనపట్ల ప్రేమానురాగాలను కనబరిచేవాళ్ల కోసం బాబా ఎంతగా ఆరాటపడతాడో ... ఆదుర్దాపడతాడో చెప్పుకోవడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది.