ఇక్కడ ఏ వైపు చూసినా శివలింగాలే !

ఏదైనా క్షేత్రానికి వెళితే అక్కడ ప్రధాన దైవానికి సంబంధించిన ఆలయంతో పాటు మరెన్నో ఇతర ఆలయాలు ... మందిరాలు కనిపిస్తూ ఉంటాయి. శివకేశవ భేదం లేకుండా ఈ ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక కొన్ని శివలింగాలు గర్భాలయంలోను ... మరికొన్ని శివలింగాలు ఆలయ ప్రాంగణంలోను కనిపిస్తుంటాయి. అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా 'వెల్లటూరు' దర్శనమిస్తుంది.

నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. కృష్ణనదీ తీరంలో గల ఈ క్షేత్రం ఒకప్పుడు కోటిన్నొక్క శివలింగాలతో ... నూటొక్క దేవాలయాలతో విలసిల్లినట్టుగా చరిత్ర చెబుతోంది. అయితే కాలక్రమంలో కొన్ని శివలింగాలు కనుమరుగైపోయాయి. మరికొన్ని శివలింగాలు వరదల్లో కొట్టుకుని పోయాయని చెబుతుంటారు. అలనాటి వైభవానికి గుర్తుగా మిగిలిన శివలింగాలు దర్శనమిస్తూనే ఉంటాయి.

ఒకప్పుడు ఇక్కడ వెలుగొందినట్టుగా చెప్పబడుతోన్న ఆలయాల్లో కూడా చాలావరకూ శిధిలమైపోయి కనిపిస్తుంటాయి. పర్వదినాల్లో ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు శ్రీ భూ నీలా సమేత చెన్నకేశవస్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. అలాగే ప్రసన్నాంజనేయ స్వామినీ ... నీలకంఠస్వామిని ... క్షీరలింగేశ్వర స్వామిని ... ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుని పూజాభిషేకాలు జరిపిస్తుంటారు.

పురాణం సంబంధమైన కథలు ... చారిత్రకపరమైన కథలు ఇక్కడి స్థలమహాత్మ్యంతో ముడిపడి ఆసక్తికరంగా వినిపిస్తుంటాయి. ఎన్నో విశేషాలకు ... మరెన్నో మహిమలకు నిలయంగా అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News