భగవంతుడి నామాన్ని స్మరిస్తే చాలు
భగవంతుడికిగల శక్తులనుబట్టి ... ఆయనకిగల గుణవిశేషాలను బట్టి అనేక నామాలతో పిలుస్తూ ఉండటం జరుగుతుంది. నారాయణుడు ... శివుడు ... రాముడు ... కృష్ణుడు ... నరసింహుడు ఇలా అవతారమూర్తులంతా అనేక నామాలతో కీర్తించబడుతున్నారు.
దేవుడి నామాల్లో ఏదో ఒక నామాన్ని ఎంచుకుని అనునిత్యం ... అనుక్షణం ఆ నామాన్ని స్మరించవచ్చు. ప్రేమతో ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆయన ఆప్యాయంగా పలుకుతూనే ఉంటాడు. భగవంతుడికి భారీగా పూలు .. పండ్లు తెచ్చి పెద్దయెత్తున పూజలు చేయించి దానధర్మాలు చేస్తేనే తప్ప ఆయన అనుగ్రహం లభించదని కొంతమంది అనుకుంటూ ఉంటారు.
భగవంతుడిని వైభవంగా చూసుకోవాలనుకున్నవాళ్లు తమ శక్తికొద్దీ పూజించుకోవచ్చు. ఆయనకి సంతోషాన్ని కలిగించడం కోసం నిస్సహాయులకు దానధర్మాలు చేయవచ్చు. అయితే ఈ విధంగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడం అందరికీ సాధ్యం కాదు. అందరికీ అందుబాటులో ఉండటం కోసమే భగవంతుడు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగానే ఆయన తన నామాన్ని నిరంతరం స్మరిస్తేచాలు, వాళ్లని వెన్నంటి కాపాడుతూ ఉంటానని సెలవిచ్చాడు.
తన నామాన్ని స్మరించడానికి ఎలాంటి నియమాలు పాటించవలసిన అవసరం లేకుండా చేశాడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ... ఏ వేళలోనైనా తన నామాన్ని స్మరించే అవకాశాన్ని కల్పించాడు. ఆదుకునే దైవం ఇన్ని అవకాశాలను కల్పించడం కంటే మానవులకు మరో అదృష్టం ఏముంటుంది ? దశవిధ పాపాలు ... అనేక దోషాలు భగవంతుడి నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉండటం వలన నశిస్తాయని చెప్పబడుతోంది.
మోక్షాన్ని పొందిన మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే, వాళ్లు నిరంతరం భగవంతుడి నామాన్ని స్మరించిన వైనం ... ఆయన నామసంకీర్తనంలో తరించిన తీరు కనిపిస్తుంది. భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉండటం వలన ఆయనకి ఎప్పుడూ సమీపంగా ఉన్నామనే అనుభూతి కలుగుతుంది. ఆయన సన్నిధిలో ఉండగా చింతించవలసిన పనిలేదనే విశ్వాసం కలుగుతుంది. అనంతమైన ఆ విశ్వాసమే సమస్త సంతోషాలకు కారణమవుతుంది. సకలశుభాలను చేకూరుస్తూ ఇహంలోను .. పరంలోను సుఖశాంతులను ప్రసాదిస్తుంది.