అన్నాచెల్లెళ్ల పాదముద్రల వెనుక కథ !
కృష్ణానదీ తీరప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధమైన ఆలయాలు అలరారుతున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా 'వెల్లటూరు' దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా మేళ్ల చెరువు మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఒకప్పుడు వెల్లటూరు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లిందని చెప్పడానికి నిదర్శనంగా ఇక్కడ అనేక ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి.
హరిహరుల ఆలయాలు కొలువుదీరిన ఈ క్షేత్రం అనేక మహిమలకు నిలయంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి కృష్ణానది స్నానం సర్వపాపాలను హరించి వేస్తుందని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగా ఆసక్తికరమైన కథ ఒకటి ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది.
చిన్నతనంలో అంటే ఊహతెలియడానికి ముందు ఇద్దరు అన్నాచెల్లెళ్లు తప్పిపోతారు. చాలాకాలం తరువాత విధి ఆడిన వింతనాటకంలో భాగంగా వాళ్లకి వివాహం జరుగుతుంది. అక్షింతలు తలపై పడగానే వారి పసుపు బట్టలు నల్లగా మారిపోయాయట. ఆందోళన చెందిన ఆ ఇద్దరూ ఒక మహర్షిని కలిసి జరిగిన సంఘటనను వివరిస్తారు.
దివ్యదృష్టి ద్వారా విషయాన్ని గ్రహించిన ఆయన, ఆ ఇద్దరూ అన్నాచెల్లెళ్లనే నిజం చెబుతాడు. ఆ విషయం తెలియక వివాహం చేసుకోవడం వలన కలిగిన దోషం కారణంగా వాళ్ల పసుపు బట్టలు నల్లగా మారిపోయాయని చెబుతాడు. అన్ని పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ వెళ్లమనీ ... ఎక్కడైతే తిరిగి ఆ నల్లని వస్త్రాలు పసుపురంగులోకి మారతాయో అక్కడ వాళ్ల దోషం తొలగిపోయినట్టుగా భావించమని చెబుతాడు. అన్నాచెల్లెళ్లుగా జీవించమని ఆశీర్వదిస్తాడు.
అలా బయలుదేరిన అన్నాచెల్లెళ్లు అనేక క్షేత్రాలలోని తీర్థాలలో స్నానమాచరిస్తూ వస్తారు. వెల్లటూరులోని కృష్ణానదీ తీరంలో స్నానం చేయగానే వాళ్ల వస్త్రాలు పసుపురంగులోకి మారి దోషం తొలగిపోయిందట. అందుకు నిదర్శనంగా ఇక్కడ కనిపించే పాదముద్రలు ఆ అన్నాచెల్లెళ్లవేనని చెబుతుంటారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఆ పాదముద్రలను పూజిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన తెలిసిగానీ ... తెలియకగాని తాము చేసిన పాపాలు ... దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు.