గోదాదేవి భుజంపై దర్శనమిచ్చే రామచిలుక !

గోదాదేవి అనే పేరే ఎంతో పవిత్రమైనదిగా అనిపిస్తూ ఉంటుంది ... వినిపిస్తూ ఉంటుంది. ఆ తల్లినే 'ఆండాళ్' అని పిలుస్తుంటారు. ఆండాళ్ అనే పేరు ఆత్మీయతను ఆవిష్కరిస్తూ ఉంటుంది. రంగనాయకస్వామికి మనసిచ్చిన గోదాదేవి ఆ స్వామిని కీర్తిస్తూ 30 పాశురాలను రచించింది. ఈ ధనుర్మాస కాలంలో రోజుకో పాశురాన్ని స్వామి సన్నిధిలో గానం చేయడం జరుగుతూ ఉంటుంది.

లక్ష్మీదేవి అంశతో తులసివనంలో విష్ణుచిత్తుడికి లభించిన గోదాదేవి, ఆ స్వామిని వివాహం చేసుకున్నది ఈ మాసంలోనే. అలాంటి ఈ మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేకపూజలు అందుకుంటూ ఉంటుంది. వివిధ రకాల పూలమాలికలతోను ... ఆభరణాలతోను అలంకరించబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది. ఆ తల్లి భుజంపైగానీ ... చేతిలో గాని ఒక రామచిలుక కనిపిస్తూ ఉంటుంది.

విల్లిపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే ఈ రామచిలుక తయారీ విషయంలో వాళ్లు ఎంతటి శ్రద్ధ తీసుకుంటున్నది తెలుస్తుంది. సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారుచేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమర్చుతారు. నిజంగా రామచిలుకే అమ్మవారి భుజంపై వాలిందా ? అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇలా చిలుకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు. ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించడం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పని సరిగా నెరవేరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News