పుణ్యరాశిని పెంచే విష్ణువు ఆరాధన
లోక కల్యాణం కోసం వివిధ అవతారాలను ... రూపాలను ధరించిన శ్రీమహా విష్ణువును నిత్యం పూజిస్తూనే ఉండాలి. సదా ఆ స్వామిని సేవిస్తూ తరిస్తూనే ఉండాలి. అయితే కొన్ని పుణ్యతిథుల్లో స్వామిని సేవించడం వలన కలిగే ఫలితాలు మరింత విశేషమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి విశేషమైన రోజుల్లో 'ఉత్పత్తి ఏకాదశి'ఒకటి.
మార్గశిర బహుళ ఏకాదశిని ఉత్పత్తి ఏకాదశిగా పిలుస్తుంటారు. శ్రీమహావిష్ణువు సంకల్ప మాత్రంచేత ఈ రోజున ఆయన శరీరం నుంచి 'ఏకాదశి' అనే కన్య జనించిన కారణంగా దీనికి ఉత్పత్తి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక స్వామివారి శరీరం నుంచి ఏకాదశి జనించడానికి కారణం లేకపోలేదు.
'మురాసురుడు' అనే రాక్షసుడు దేవతలను ... సాధుసజ్జనులను హింసించసాగాడు. వాడి ఆగడాలను భరించలేక అంతా ఆ శ్రీమన్నారాయణుడికి మొరపెట్టుకుంటారు. దాంతో లోకకంటకుడైన మురాసురుడిని అంతం చేయాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆయన ఆ అసురుడికి గల వరాలను దృష్టిలో పెట్టుకుని తన శరీరం నుంచి ఒక కన్యను సృష్టిస్తాడు.
మురాసురుడిని ఆ కన్య సంహరించడంతో లోకంలో శాంతి స్థాపించబడుతుంది. లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఏకాదశి అనే కన్యను ఆవిర్భవింపజేసిన ఈ రోజున ఆ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ రోజున స్వామిని దర్శించడం .. పూజించడం .. 'ఏకాదశి వ్రతం' ఆచరించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆ పుణ్యఫలితాల కారణంగా సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.