గణపతి సన్నిధిలో కొలువైన హనుమంతుడు

గణపతిని పూజించడం వలన తలపెట్టిన కార్యాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా అవి పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. గణపతిని ఆరాధించడం వలన విద్యా సంబంధమైన విషయాల్లోనూ ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఇక ఆటంకాలు మాత్రమే కాకుండా సమస్త దోషాలను తొలగించే గణపతిగా 'శ్వేతార్కమూల గణపతి' కనిపిస్తుంటాడు.

శ్వేతార్కమూల గణపతి ఆలయం వరంగల్ జిల్లా 'కాజీపేట' లో దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి ..జ్ఞానముద్ర సరస్వతీదేవి .. హయగ్రీవస్వామి .. వేంకటేశ్వరస్వామి .. రుక్మిణీ సత్యభామా సమేత కృష్ణుడు ..శివుడు .. నాగేంద్రుడు .. సంతోషిమాత .. అన్నపూర్ణాదేవి .. లక్ష్మీదేవి .. రమాసహిత సత్యనారాయణస్వామి .. శిరిడీ సాయిబాబా పరివార దేవతలుగా కొలువుదీరి కనిపిస్తుంటారు.

ఈ వరుసలోనే ప్రత్యేక ఆలయంలో కొలువైన హనుమంతుడు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడు. శ్వేతార్కమూల గణపతి ఆలయంలో ప్రతి మంగళవారం రోజున ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఈ రోజున పెద్దసంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. హనుమంతుడికి ఇష్టమైనవారం కావడం వలన ఇక్కడ కొలువైన హనుమంతుడిని కూడా భక్తులు తప్పనిసరిగా దర్శించుకుంటూ ఉంటారు. ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు.

హనుమంతుడికి తమ మనసులోని మాటను చెప్పుకుని కరుణించమంటూ ప్రార్ధిస్తుంటారు. గణపతి సన్నిధిలో కొలువైన ఈ హనుమంతుడిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరతాయని విశ్వసిస్తుంటారు. గణపతితో పాటు హనుమ ఆశీస్సులను ... అనుగ్రహాన్ని పొందుతుంటారు.


More Bhakti News