భక్తుల కుటుంబీకుల భారమూ భగవంతుడిదే !
మహాభక్తుల జీవితాలను పరిశీలిస్తే వాళ్లకు ఆ భగవంతుడి ఆరాధన మినహా మరో ధ్యాస ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆ భక్తుల కుటుంబీకుల బాధ్యతను కూడా ఆ భగవంతుడు వహించడం కనిపిస్తుంది. ఇందుకు ఉదాహరణగా పురందరదాసు జీవితంలోని ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.
పురందరదాసు మంచి స్థితిమంతుడుగా ఉన్నప్పుడు తన కూతురు 'రుక్మిణీ బాయి' కి వివాహాన్ని జరిపిస్తాడు. ఆ తరువాత ఆధ్యాత్మిక జీవనాన్ని ఆరంభించిన ఆయన తన ఆస్తిపాస్తులను పేదలకు పంచేస్తాడు. ఆస్తిపాస్తులు చూసి రుక్మిణీబాయిని కోడలిగా చేసుకున్న అత్తవారింటివాళ్లు, ఇక ఆమె వైపు నుంచి ఎలాంటి సంపదలు రావని తెలిసి నానాకష్టాలు పెడుతుంటారు. చేసేదిలేక ఆమె ఆ బాధలను మౌనంగా భరిస్తూ ఉంటుంది.
ఈ విషయం రుక్మిణీ తల్లికి తెలియడంతో ఆమె బాధపడుతూ పరిస్థితిని భర్త చెవిన వేస్తుంది. అన్నింటికీ ఆ పాండురంగడే ఉన్నాడని ఆయన సమాధానమిస్తాడు. అంతే ఆ క్షణమే పాండురంగడు రుక్మిణీబాయి ఇంటికి చేరుకుంటాడు. అదృశ్యరూపంలో రుక్మిణీ బాయికి తోడుగా ఉంటూ ఆమె కష్టపడకుండా సహకరిస్తూ ఉంటాడు. స్వామి లీలా విశేషాలను గ్రహించిన రుక్మిణీబాయి మనసులోనే ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.
రుక్మిణీబాయి విషయంలో ఆమె అత్తగారి ఆగడాలకు అంతులేకుండా పోవడంతో, ఆ స్వామి ఆమెకి తగినవిధంగా బుద్ధిచెబుతాడు. ఆమె తన తప్పు తెలుసుకుని మనసు మార్చుకునేలా చేసిన తరువాతనే ఆ స్వామి అక్కడి నుంచి బయటికి అడుగుపెడతాడు. తనని విశ్వసించే భక్తులనే కాదు ... ఆ భక్తుల కుటుంబీకుల బాధ్యతను కూడా స్వామి స్వీకరిస్తాడని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా కనిపిస్తూ ఉంటుంది.