అలాంటివారిపై భగవంతుడు ఆగ్రహిస్తాడు

అంబరీషుడు వంటి మహాభక్తుడినీ అవమానించడానికీ, ఆయనని బాధపెట్టడానికి దూర్వాస మహాముని ప్రయత్నిస్తాడు. తపోబల సంపన్నుడే అయినా, తన భక్తుడి పట్ల ఆయన అహంభావాన్ని ప్రదర్శించడం సహించలేక శ్రీమహావిష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. అలాంటి స్వామి కాలమెంత మారినా తన భక్తుడిని కష్టపెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకుంటాడా ? ఎంతమాత్రం సహించడనే విషయం మనకి 'తుకారామ్' జీవితంలో జరిగిన ఒక సంఘటన విషయంలో స్పష్టమవుతుంది.

మొదటి నుంచి కూడా ఒక వ్యక్తి తుకారామ్ పట్ల అసూయా ద్వేషాలను కనబరుస్తూ వస్తుంటాడు. అయితే తుకారామ్ చూపిన క్షమాగుణం ఆ వ్యక్తిని ధోరణిని మార్చేస్తుంది. ఆ వ్యక్తి తుకారామ్ లోని గొప్పతనాన్ని గ్రహించి ఆయనని అభిమానించేవారిలో ఒకడుగా మారిపోతాడు. ఆ వ్యక్తి ఒకసారి తుకారామ్ ని తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు.

తుకారామ్ విషయంలో భర్త ఈ విధంగా మారిపోవడం నచ్చని అతని భార్య, తుకారామ్ ని అవమానపరచడానికి ప్రయత్నిస్తుంది. అంతే ... ఆ క్షణం నుంచి ఆమె ఏదో తెలియని బాధతో విలవిలలాడిపోసాగింది. చుట్టుపక్కలవాళ్లంతా అక్కడికి పరిగెత్తుకు వస్తారు. భార్యకి హఠాత్తుగా ఏం జరిగిందో తెలియక ఆమె భర్త అయోమయానికి లోనవుతాడు.

ఆమె చర్య కారణంగా తనపట్ల ఆమెకి గల కోపం ఏ స్థాయిలో ఉందనేది తుకారామ్ గ్రహిస్తాడు. అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా, భగవంతుడు దయామయుడు అంటూ ఆమెను స్పర్శిస్తాడు. అంతే ఆమె ఆ బాధ నుంచి ఉపశమనం పొందుతుంది. భగవంతుడి సేవకులను బాధించాలని చూస్తే ఆయన క్షమించడని గ్రహించి, తనని మన్నించమంటూ తుకారామ్ పాదాలపై పడుతుంది. ఆరోజు నుంచి తుకారామ్ ని అభిమానిస్తూ ఆరాధించేవారిలో ఆమె కూడా చేరిపోతుంది.


More Bhakti News