అందరినీ నడిపించేది ఆ భగవంతుడే !
ధర్మబద్ధంగా ఎవరు ఏది కోరుకుంటే అది వారికి సమకూర్చడానికే భగవంతుడు ప్రయత్నిస్తుంటాడు. ఇక జ్ఞానసముపార్జన చేయాలనుకునే వాళ్లకు ... భగవంతుడి తత్త్వాన్ని అర్థంచేసుకోవాలనుకునేవాళ్లకు తగిన సూచనలిస్తూ స్వామి ముందుకు నడిపిస్తుంటాడు. ఎంతోమంది మహానుభావుల జీవితాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
సాక్షాత్తు దైవం యొక్క అనుగ్రహాన్ని ఆశించి ప్రార్ధనలు చేసినా, ముందుగా గురువును ఆశ్రయించి జ్ఞానోపదేశం పొందమనే ఆ భగవంతుడు కూడా సెలవిచ్చాడు. గురువును సేవించడం వలన ... ఆయన ఉపదేశాలను అర్థంచేసుకోవడం వలన భగవంతుడిని సమీపించడం తేలిక అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. 'పురందరదాసు' విషయానికే వస్తే, సంపదలకు తప్ప మరిదేనికీ ప్రాధాన్యతను ఇవ్వని ఆయనకి అది అశాశ్వతమైనదనే విషయం తెలిసేలా చేస్తాడు.
భగవంతుడి పాదలాను ఆశ్రయించడంలో గల ఆనందాన్ని పొందిన ఆయన తన ఆస్తిపాస్తులను అందరికీ పంచేస్తాడు. ఆ తరువాత తన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్కడి నుంచి ఎలా ప్రారంభించాలా అని ఆయన ఆలోచిస్తూ ఉంటే, స్వప్నంలో పాండురంగడు కనిపించి వ్యాసరాయలవారిని ఆశ్రయించమని చెబుతాడు. స్వామి ఆదేశానుసారం తన కుటుంబసభ్యులతో కలిసి వ్యాసరాయలవారి ఆశ్రమానికి చేరుకుంటాడు.
ఈ లోగా వ్యాసరాయలవారికి కూడా స్వప్న దర్శనమిచ్చిన స్వామి, పురందరదాసుకి ఆశ్రయమిచ్చి ఆయనకి అవసరమైన ఉపదేశం చేయమని చెబుతాడు. దాంతో ఆయన పురందరదాసును ఆప్యాయంగా ఆహ్వానిస్తాడు. భగవంతుడి పట్ల పురందరదాసుకి గల అపారమైన విశ్వాసాన్ని చూసి, వ్యాసరాయలవారు ఆనందాశ్చర్యాలకి లోనవుతాడు. ఆయన విషయంలో పాండురంగడు తనకి అప్పగించిన పనిని ఆనందంగా పూర్తిచేస్తాడు. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆయన ద్వారా మరింత మేలు జరగడానికి తనవంతు కృషిచేస్తాడు.