మంగళచండీ స్తోత్ర పఠన ఫలితం !

పెళ్లీడుకి వచ్చిన అమ్మాయికి సాధ్యమైనంత తొందరగా వివాహం చేసి పంపించాలని తల్లిదండ్రులు ఆతృతపడుతుంటారు. తమకన్నా ఎక్కువగా అమ్మాయికి రక్షణను కల్పిస్తూ, తమకన్నా ఎక్కువగా అమ్మాయికి ప్రేమానురాగాలను అందించే మంచి సంబంధం కోసం వాళ్లు అన్వేషిస్తుంటారు.

ఈ నేపథ్యంలో మంచి సంబంధాలు తప్పిపోతే వాళ్లు ఎంతగానో బాధపడతారు. అందుకు కారణం 'కుజదోషం' అని తెలిసినప్పుడు మరింత ఆందోళన చెందుతుంటారు. కుజదోషం బారి నుంచి బయటపడటం కోసం నానాప్రయత్నాలు చేస్తుంటారు. కుజుడిని శాంతింపజేయడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది ... ఫలితంగా కుజదోష ప్రభావం తగ్గుతుంది.

కుజదోష ప్రభావం నుంచి బయటపడటానికి గల మార్గాలలో ఒకటిగా 'మంగళచండీ స్తోత్ర పఠనం' కనిపిస్తుంది. కుజుడికి 'మంగళుడు' అనే పేరు ఉంది .. ఆయన మంగళచండీ మహాభక్తుడు. ఆ తల్లిని ఎవరైతే అంకితభావంతో ఆరాధిస్తూ ఉంటారో, వాళ్లపట్ల ఆయన అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు. అందువలన ప్రతి మంగళవారం 'మంగళచండీ స్తోత్రం' పఠించడం వలన అమ్మవారికి ప్రీతి కలుగుతుంది.

ఆ తల్లికి ప్రీతిపాత్రులైన వాళ్ల విషయంలో కుజుడు కూడా శాంతమూర్తిలా వ్యవహరిస్తాడు. ఆయన నుంచి ప్రతికూల ఫలితాలు సహజంగానే తగ్గుముఖం పడతాయి. ఫలితంగా కుజదోష ప్రభావం నుంచి బయటపడటం ... వివాహయోగం కలగడం జరుగుతాయి. కాబట్టి కుజ దోషం కారణంగా వివాహ సంబంధమైన విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటోన్న యువతులు ప్రతి మంగళవారం మంగళచండీ స్తోత్రం పఠించడం వలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది.


More Bhakti News