అయ్యప్పస్వామి ఆరాధనా ఫలితం !

మార్గశిర మాసంలో అయ్యప్పస్వామి దీక్ష ధారణ ఎక్కువగా జరుగుతుంటుంది. అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తులతో ఆయా దేవాలయాలు సందడిగా కనిపిస్తూ ఉంటాయి. అయ్యప్పస్వామి భజనలతో ... పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వైభవాన్ని సంతరించుకుని దర్శనమిస్తుంది.

కొంతమంది భక్తులు ఆలయ ప్రాంగణంలోనే పడిపూజలు నిర్వహిస్తుంటారు. మండలకాలం పాటు భిక్షకి కావసిన ఏర్పాట్లను కూడా ఆలయప్రాంగణంలోనే చేసుకుంటూ ఉంటారు. అయ్యప్పస్వామి దీక్ష అనేక నియమాల తోరణంగా కనిపిస్తుంది. దీక్షధారణ చేపట్టినవాళ్లు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేస్తారు. నల్లని వస్త్రాలను ధరించి .. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ... నేలపై నిద్రిస్తుంటారు.

దీక్షా కాలం పూర్తయ్యేంత వరకు స్వామివారి గురించి తప్ప మరో ఆలోచన మనసులోకి రానివ్వరు. అనునిత్యం స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు ... ఆయన శరణాలు చెప్పుకుంటూ పరవశిస్తుంటారు. శబరిమల వెళ్లి స్వామి దర్శనంతో తరించి తిరిగి వస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన అయ్యప్పస్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ స్వామి క్రుపాకటాక్షాల వలన సకల శుభాలు చేకూరతాయి. అంతేకాదు ... అయ్యప్పస్వామిని ఆరాధించడం వలన శనిదేవుడు కూడా శాంతిస్తాడని చెప్పబడుతోంది.

మార్గశిర మాసమంటే శనిదేవుడికి కూడా ఎంతో ఇష్టం. అలాంటి ఈ మాసంలో అయ్యప్ప దీక్ష తీసుకుని నియమనిష్టలను ఆచరిస్తూ ఆ స్వామికి పూజాభిషేకాలు జరుపుతుంటారు. నల్లని వస్త్రాలను ధరించి పాటించే ఈ నియమాలు శనిదేవుడికి కూడా ప్రీతిని కలిగిస్తాయట. అందువలన మార్గశిర మాసంలో చేసే అయ్యప్పస్వామి పూజల వలన శనిదేవుడు కూడా సంతృప్తి చెందుతాడని చెప్పబడుతోంది. శని దోషంతో బాధపడుతున్నవాళ్లు ఆ స్వామి అనుగ్రహం వలన ఆ దోష ప్రభావం నుంచి బయటపడే అవకాశం లభిస్తూ ఉంటుంది.


More Bhakti News