అవమానం జరిగినట్టుగా కల వస్తే ?

అవమానాన్ని భరించడమంటే ఆకలిని భరించడమంత తేలిక కాదు. అవమానం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ... మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. అదే పనిగా వెంటాడుతూ నిద్రాహారాలను దూరం చేస్తుంది. ఏదైనా ముఖ్యమైన పనిమీద ఎవరి దగ్గరికైనా వెళ్లాలనుకుని, అక్కడ ఏదైనా అవమానం జరుగుతుందేమోననే సందేహంతో కొంతమంది ఆగిపోతుంటారు. ఫలితంగా పొందవలసిన అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటారు.

అవమానాన్ని తట్టుకుని నిలబడటం కష్టం ... అలా నిలబడగలిగితే అభివృద్ధిని సాధించడం ఖాయమనే విషయాన్ని ఎంతోమంది నిరూపించారు. ఇక అవమానమనే దానిని కలలో కూడా ఊహించలేమని మరికొందరు అంటూ ఉంటారు. అలాంటిది అవమానం జరిగినట్టుగా కల వస్తే ...? కలలో అనేక సంఘటనలు నిజంగా జరుగుతున్నట్టుగానే కనులముందు కదలాడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆపదలో పడినట్టు ... అవమానం పొందినట్టు కలలు వస్తూనే ఉంటాయి.

ఒక్కోసారి ఏదో ఒక విషయంగా అవమానంపాలైనట్టు కల వస్తుంది. మెలకువ వచ్చేంతవరకూ అది కల అనే విషయం తెలియదు కనుక, అదే విధమైన బాధను అనుభవిస్తూ మేల్కొనడం జరుగుతుంది.ఎందుకు అలాంటి కల వచ్చిందో ... దాని ఫలితం ఎలా ఉంటుందోననే ఆలోచన ఎక్కువవుతూ ఉంటుంది. నిజంగానే జరగనున్న అవమానాన్ని ఆ కల సూచిస్తుందా ? అనే ఆందోళనకి లోనవుతుంటారు.

అయితే అవమానం జరిగినట్టుగా కల వస్తే, అభినందనలు దక్కుతాయని చెప్పబడుతోంది. అవమానం జరిగినట్టుగా కల వస్తే, అందిపుచ్చుకున్నట్టుగా అవకాశాలు వస్తాయి ... ప్రతిభకు తగిన గుర్తింపుగా ప్రశంసలు లభిస్తాయి. అందువలన అవమానం పొందినట్టుగా కల వస్తే నిరాశా నిస్పృహలతో డీలా పడిపోవలసిన పనిలేదు. అది ఆశాజనకమైనదిగా భావించి ఆనందంగా ఉండవచ్చు.


More Bhakti News