మాటకి గల విలువ అటువంటిది !

మందర చెప్పుడు మాటలు కైకేయి మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. దాంతో ఆమె భరతుడికి పట్టాభిషేకం ... రాముడితో అరణ్యవాసం చేయించమని దశరథుడిపై వత్తిడి తెస్తుంది. గతంలో తాను కోరుకోమని చెప్పిన రెండు వరాలను కైకేయి ఇలా కోరుకోవడంతో దశరథుడు కాదలేకపోతాడు. సీతారాములు అడవులకు బయలుదేరి వెళ్లగానే, వాళ్లని విడిచి ఉండలేక ప్రాణాలు వదులుతాడు.

ఆ సమయంలో అక్కడలేని భరతుడు జరిగింది తెలుసుకుని తల్లడిల్లిపోతాడు. తల్లిని వెంటబెట్టుకుని బయలుదేరి అడవీ మార్గాన ప్రయాణం చేస్తూ సీతారామలక్ష్మణులను కలుసుకుంటాడు. తండ్రి మరణవార్త విన్న రాముడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. అడవిలో సీతారాములను అలా చూడగానే కైకేయి కన్నీళ్ల పర్యంతమవుతుంది.

స్వార్థ బుద్ధితో ఆలోచించినందుకు ఐదవతనాన్ని కోల్పోయానని కైకేయి ఆవేదన చెందుతుంది. తను చేసిన పని వలన భరతుడి ప్రేమాభిమానాలకు కూడా దూరమయ్యానంటూ బాధపడుతుంది. తాను మనసు మార్చుకున్నాననీ ... వరాలుగా భావించి తాను కోరినవాటిని వెనక్కి తీసుకుంటున్నానని చెబుతుంది. తమతో పాటు అయోధ్యకి వచ్చి అందరికీ ఆనందాన్ని కలిగించవలసిందిగా కోరుతుంది.

ఆమె అభ్యర్థనను రాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు. వరాలను ఆమె వెనక్కి తీసుకున్నా, తాను తన తండ్రి మాటకు కట్టుబడే ఉంటానని చెబుతాడు. ఇచ్చిన మాటకు ... పెద్దలు చెప్పిన మాటకు కట్టుబడి నడచుకోవడమే ధర్మమని అంటాడు. ఆ ధర్మాన్ని తాను ఆచరించినప్పుడే తన తండ్రి ఆత్మకు శాంతి కలుగుతుందని చెబుతాడు. తాము ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నంత కాలం ధర్మం తమని కాపాడుతూ ఉంటుందనీ, అందువలన తమ వనవాసాన్ని గురించి ఆందోళన చెందనవసరం లేదని చెప్పి వాళ్లను అక్కడి నుంచి పంపించివేస్తాడు.


More Bhakti News