మనసు మార్చిన మహా గణపతి
వినాయకుడి ఆలయం కనిపించినా ... దారిపక్కనే చిన్న మందిరం కనిపించినా ఆగి నమస్కరించుకోకుండా ఎవరూ ముందుకు వెళ్లరు. ఆ స్వామితో అందరికీ గల అనుబంధం అలాంటిది. జీవితంలో దారిద్ర్యం వలన కలిగే దుఃఖం దూరం కావాలన్నా, సంతోషం ... సంతృప్తి కలగాలన్నా తలపెట్టిన పనులు విజయవంతం కావాలి.
అందుకు అన్నివిధాలుగా సహకరించేది ఆ వినాయకుడే. అందువలన ఆ స్వామిని అంతా ఆరాధిస్తూ ఉంటారు. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న స్వయంభువు వినాయక క్షేత్రాల్లో ఒకటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గరలో కనిపిస్తుంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో ఇక్కడి వినాయకుడు వెలుగుచూడటంతో, అక్కడి వాళ్లు స్వయంభువు గణపతిని పూజించడం ప్రారంభించారు.
ఆ స్వామి అనుగ్రహంతో శుభాలు చేకూరుతుండటంతో ఆయనకి ఆలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. నిర్మాణం జరుగుతూ ఉండగా ఒక ఆంగ్లేయ అధికారి వచ్చి అడ్డుకుంటాడు. అక్కడ ఆలయాన్ని నిర్మిస్తే తనకి గల అధికారంతో చర్యలు తీసుకుంటానని బెదిరించి వెళతాడు. దాంతో అక్కడివారికి ఏంచేయాలో తెలియక ఆలోచనలోపడతారు. అయితే ఆ రాత్రి ఆ ఆంగ్లేయ అధికారికి స్వప్నంలో స్వామి కనిపించాడట. తన సంకల్పం మేరకు ... భక్తుల అభీష్టం మేరకే అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతోందనీ, దానిని ఆపేందుకు ప్రయత్నించవద్దని చెప్పాడట.
స్వామి మహిమను అర్థంచేసుకున్న ఆ అధికారి తన మనసు మార్చుకుంటాడు. జరిగిన సంఘటనను గురించి చెప్పి ఆలయ నిర్మాణం కొనసాగించమని అక్కడివారితో చెబుతాడు. స్వామి తన మహిమను చాటుకున్నాడనే సంతోషంతో ... ఆయన అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనే ఉత్సాహంతో భక్తులు ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు. అలా ఆనాటి నుంచి నేటి వరకూ ఇక్కడి స్వామి మహిమలు భక్తుల అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి. స్వామివారికి భక్తులు చేసే సేవలు పెరుగుతూనే ఉన్నాయి.