ఆవేశం కంటే ఆలోచన బలమైనది
మాటకంటే మౌనం బలమైనది ... ఆవేశంకంటే ఆలోచన బలమైనదని ఎంతోమంది విజ్ఞులు సెలవిచ్చారు. అలాంటి మహానుభావులలో 'అక్రూరుడు' ముందువరుసలో కనిపిస్తాడు. గయుడు అనే గంధర్వరాజు చేసిన అపరాధం కృష్ణుడికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో ఆయన గయుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
గయుడి ప్రాణాలు తీస్తానని చెప్పినది కృష్ణుడనే విషయం తెలియక, గయుడిని కాపాడతానని అర్జునుడు మాట ఇస్తాడు. తనకీ అర్జునుడికి యుద్ధం లేకుండా సంధిప్రయత్నం చేసి, పాండవుల ఆశ్రయంలో ఉన్న గయుడిని తీసుకురమ్మని చెప్పి తన ఆత్మీయుడైన అక్రూరుడిని పంపిస్తాడు కృష్ణుడు. పాండవుల నివాసానికి చేరుకున్న అక్రూరుడు .. కృష్ణుడి సందేశాన్ని వినిపిస్తాడు.
కృష్ణుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోవద్దనీ, గయుడిని అప్పగించమని కోరతాడు. కృష్ణుడు చనువుగా మెలిగిన కారణంగా ఆయన శక్తిసామర్థ్యాలను వాళ్లు తెలుసుకోలేకపోతున్నారని అంటాడు. గయుడి ప్రాణభయానికి కారకుడు కృష్ణుడని తెలియక తాను మాట ఇచ్చాననీ, మాట ఇచ్చిన తరువాత దానికి కట్టుబడి ఉండటమే ధర్మమని సమాధానమిస్తాడు అర్జునుడు.
ఆంతర్యాన్ని గ్రహించిన అక్రూరుడు తిరిగి కృష్ణుడి మందిరానికి చేరుకుంటాడు. పాండవుల విషయంలో కృష్ణుడిని మరింత రెచ్చగొట్టకుండా, ఆయనపట్ల వాళ్ల ప్రేమానురాగాలు ఎంతమాత్రం తగ్గలేదని ముందుగా చెబుతాడు. అర్జునుడితో యుద్ధానికి దిగవలసి వస్తున్నందుకు కృష్ణుడు ఎంతగా బాధపడుతున్నాడో, ఆయనతో పోరుచేయవలసి వస్తున్నందుకు అర్జునుడు అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాడని అంటాడు.
చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకునేందుకు కృష్ణుడు ... ఇచ్చిన మాటకు కట్టుబడి అర్జునుడు వ్యవరిస్తున్నారే గాని వాళ్ల మధ్య గల ప్రేమానురాగాలు రవ్వంత కూడా తగ్గలేదని అక్రూరుడు శాంతివచనాలు మాట్లాడతాడు. ఇలా అత్యంత క్లిష్టమైన సమయంలో కృష్ణార్జునుల మధ్య ద్వేషభావం ఏర్పడకుండా అక్రూరుడు కీలకమైన పాత్రను పోషించి చరిత్రలో నిలిచిపోయాడు.