సుఖశాంతులను ప్రసాదించే శ్రీనివాసుడు

శ్రీనివాసుడు ఆశ్రితులపాలిట కల్పవృక్షం ... భక్తుల ఆవేదనలు ఆలకించి ఆనందాన్ని అందించే అనంతశక్తి స్వరూపం. అనంతాచార్యులు ... అన్నమయ్య ... హథీరామ్ బావాజీ ... కురువనంబి ... తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులకు ఆయన ప్రత్యక్ష దర్శనమిచ్చి తరింపజేశాడు.

ఆ స్వామి దర్శనం చేసుకుని తమ కష్టాలను చెప్పుకోవడానికి కొందరు వస్తుంటారు. ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తేచాలు ఎలాంటి కష్టాలనైనా ఆనందంగా అనుభవించ వచ్చని అనుకునేవాళ్లు మరికొందరు. ఎవరు ఎలా తలచినా .. పిలిచినా ఆయన పలుకుతూనే ఉంటాడు. కోరిన వరాలను సంతోషంతో సమకూరుస్తూనే ఉంటాడు.

ఆ స్వామి సమ్మోహన రూపాన్ని అనునిత్యం కనులపండువగా చూసుకోవాలని భక్తులు అనుకోవడం సహజం. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో శ్రీనివాసుడి ఆలయాలు అంగరంగవైభవంగా వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటి వరంగల్ జిల్లా హనుమకొండలో దర్శనమిస్తుంది. ఇక్కడి ఎన్జీవోస్ కాలనీ -2లో ఈ ఆలయం కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారి సౌందర్యం చూసి తీరవలసిందే.

నిర్మలమైన మనసులతో నిర్మించినట్టుగా ఈ ఆలయం కనిపిస్తుంది. అణువణువునా స్వామి తన వైభవాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాడు. తన చల్లని చూపులతో భక్తుల హృదయాలను ప్రభావితం చేస్తూనే ఉంటాడు. ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు జరుపుతుంటారు. స్వామివారిని అంకితభావంతో పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఈ ఆలయానికి సమీపంలోనే శివాలయం కూడా దర్శనమిస్తూ ఉంటుంది. చక్కగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయంలో శ్రీనాగరాజ రామలింగేశ్వరస్వామి కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. ప్రేమతో సమర్పించే పూజాభిషేకాలను స్వీకరిస్తూ అడిగిన వరాలను అనుగ్రహిస్తూ ఉంటాడు. అలా ఈ ప్రదేశంలో కొలువుదీరిన శివకేశవుల ఆలయాలు భక్తివిశ్వాసాలకు ప్రతీకగా కనిపిస్తూ వైభవంతో వెలుగొందుతున్నాయి.


More Bhakti News