అది లక్ష్మీనారాయణుడి మహిమే !

లక్ష్మీపతిస్వామిని సేవించాలే గానీ సిరిసంపదలకు ఎలాంటి కొదవవుండదు. ఆ స్వామి ఆవిర్భవించిన అయిదు విశిష్టమైన క్షేత్రాలను పంచలక్ష్మీనారాయణుల ఆరామాలుగా పిలుస్తుంటారు. అలాంటి ఆరామాలలో ఒకటిగా 'పెదముక్తేవి' కనిపిస్తుంది. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో కొలువుదీరిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.

సాక్షాత్తు నారాయణుడు లక్ష్మీదేవిని ఎడమ తొడపై కూర్చుండబెట్టుకుని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ స్వామివారిని మొదట వ్యాసమహర్షి ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఆ తరువాత కాలంలో ఈ విగ్రహం, కృష్ణానదికి ఉపనదిగా చెప్పబడుతోన్న'భీమానది' లో కలిసిపోయిందట. తాను తిరిగి ప్రకటనమయ్యే సమయం ఆసన్నమైందని భావించిన స్వామి ఒక భక్తుడికి స్వప్న దర్శనమిచ్చి భీమానదిలో గల తన ఆచూకీని తెలియజేస్తాడు.

అయితే గ్రామస్తులతో కలిసి ఆ నది దగ్గరికి వెళ్లిన ఆ భక్తుడు, స్వామి ఎక్కడ ఉన్నది కనుక్కోలేకపోతాడు. అదే విషయమై ఆ భక్తుడు ఆవేదన వ్యక్తం చేయగా, తానున్న ప్రదేశాన్ని గుర్తించేలా స్వామి సంకేతాలు ఇచ్చాడట. అలా స్వామివారు ఇష్టపడి వెలుగుచూసిన కారణంగా ఈ క్షేత్రంలో ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు.

స్వామివారు లక్ష్మీపతిగా ఆవిర్భవించిన కారణంగా దర్శనమాత్రం చేతనే ఆయన సిరిసంపదలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు. స్వామివారి మూలమూర్తిలోని తేజస్సు ... ఆయన వెలుగు చూసిన తీరు ... చూపుతోన్న మహిమలు ... వినాయకుడు క్షేత్రపాలకుడు కావడం వలన ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెబుతుంటారు.


More Bhakti News