ఈ విషయంలో దేవుడు చూస్తూ ఊరుకోడు
భగవంతుడు తనని ఆరాధించకపోయినా పట్టించుకోడు ... కానీ తనని విశ్వసిస్తోన్న భక్తులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే మాత్రం అస్సలు సహించడు. అలాంటి పరిస్థితి వస్తే తన భక్తులకు అండగా నిలవడం ... వాళ్లను అవమానించాలనుకున్న వాళ్లకి బుద్ధిచెప్పడం చేస్తుంటాడు. అలాంటి సంఘటనలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి.
అరణ్యవాసం చేస్తోన్న పాండవులు అక్షయపాత్రను సంపాదించారనే విషయం కౌరవులకు తెలుస్తుంది. ఒకసారి అక్షయపాత్రను శుభ్రం చేశాక అది ఆ రోజుకి మరేమీ ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు, పాండవులను అవమానించాలని నిర్ణయించుకుంటారు. అక్షయపాత్ర కడిగిన తరువాత వెళ్లి .. భోజనం కావాలని పాండవులను అడగమని చెప్పి దూర్వాస మహామునిని పంపిస్తారు.
ఆయన పెద్దసంఖ్యలో శిష్యులను వెంటబెట్టుకుని పాండవులు బసచేసిన ప్రదేశానికి చేరుకుంటాడు. తాము చాలా ఆకలితో ఉన్నామనీ ... నదీ స్నానం చేసి వచ్చేలోగా భోజనాలకు ఏర్పాటు చేయమని చెప్పి వెళతాడు. అప్పటికే అక్షయపాత్రను శుభ్రం చేసేయడంతో ... దూర్వాసుడి ధోరణి గురించి తెలిసిన పాండవులు ఆలోచనలో పడతారు.
ఈ గండం నుంచి గట్టెక్కించమని ద్రౌపది కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. దాంతో తక్షణమే అక్కడ ప్రత్యక్షమైన కృష్ణుడు విషయం తెలుసుకుంటాడు. శుభ్రం చేయబడిన అక్షయపాత్రలో ఒక్క మెతుకైనా ఉందేమో చూడమని ద్రౌపదితో అంటాడు. పాత్రకి ఒక వైపున ఒకే ఒక్క అన్నపు మెతుకు అంటుకుని ఉండటం చూసి దానిని తీసుకుని నోట్లో వేసుకుంటాడు. అంతే ... అదే సమయంలో నదీస్నానం చేసి తిరిగి వస్తోన్న దూర్వాస మహామునితో పాటు ఆయన శిష్యులందరికీ కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది.
భుక్తాయాసం వస్తుండటంతో ఆశ్చర్యపోతూ ఎక్కడి వాళ్లు అక్కడే కూలబడిపోతారు. కౌరవుల మాట విని పాండవులను అవమానించడానికి వచ్చిన తమకి ఈ పరిస్థితి రావడానికి కారకుడు కృష్ణుడేనని దూర్వాసుడు గ్రహిస్తాడు. తొందరపాటుతో తాను చేసిన తప్పును మన్నించమని మనసులోనే వేడుకుంటూ, పాండవుల ఆశ్రమం వైపు రాకుండా శిష్య బృందంతో కలిసి అటు నుంచి అటే వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న పాండవులు తేలికగా ఊపిరి పీల్చుకుని కృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ధర్మాత్ములను అవమానించడానికి ప్రయత్నిస్తే భగవంతుడు చూస్తూ ఊరుకోడనడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది.