కొండగుహలో కొలువైన వేంకటేశ్వరుడు
వేంకటేశ్వరస్వామి ప్రకృతి ప్రేమికుడుగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే చుట్టూ పచ్చదనం గల ఎత్తయిన కొండలపైనే ఆయన ఎక్కువగా కొలువుదీరుతూ ఉంటాడు. కొండపైకి భక్తులు చేరుకోవడమే తనపట్ల వారికి గల విశ్వాసానికి ప్రతీకగా ఆయన భావిస్తూ ఉంటాడు. కొండ ఎక్కగానే ఆ కష్టం మరిచిపోయేలా చేస్తుంటాడు.
స్వామివారు ఆవిర్భవించిన ప్రతిక్షేత్రం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. ఆ కోవకి చెందినదిగానే 'చిలుపూరు' వేంకటేశ్వరస్వామి క్షేత్రం కనిపిస్తుంది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పరిధిలో ఈ ప్రాచీన క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి కొండపై గల గుహలో పద్మావతీదేవి సమేతంగా వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా కొలువుదీరి దర్శనమిస్తూ ఉంటాడు.
అమ్మవారితో కలిసి విహారానికి వచ్చిన స్వామి ఇక్కడి ప్రకృతి రమణీయత నచ్చడంతో వెలిశాడట. తిరుమల శ్రీనివాసుడు .. పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి 'కుబేరుడు' దగ్గర కొంత సొమ్మును అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చవలసిందిగా స్వామిని కుబేరుడు వత్తిడి చేస్తూ ఉండటంతో, స్వామివారు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చారని స్థలపురాణం చెబుతోంది.
ఆ తరువాత ఇక్కడ స్వామివారు వెలుగు చూడటం ... ఆయన మహిమలు భక్తుల అనుభవంలోకి రావడం జరిగింది. ప్రతి శనివారంతో పాటు విశేషమైన పర్వదినాల్లో పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సుఖశాంతులను ప్రసాదించమని వేడుకుంటూ ఉంటారు. ఆ స్వామికి కానుకలు ... మొక్కుబడులు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు.