మహిమలు చూపే హనుమంతుడు
హనుమంతుడికి తాను కొలిచే రాముడిపట్ల ఎంతటి ప్రేమానురాగాలు ఉన్నాయో, తనని పిలిచే భక్తులపట్ల కూడా ఆయనకి అంతే ప్రేమాభిమానాలు ఉన్నాయి. అందువల్లనే ఆయన అనేక ప్రాంతాలలో స్వయంభువుగా ఆవిర్భవించి భక్తులపాలిట అక్షయపాత్రలా కోరినవి అనుగ్రహిస్తూ వస్తున్నాడు.
అలా ఆయన 'మద్ది ఆంజనేయుడు' గా ... 'కొండగట్టు ఆంజనేయుడు' గా ... 'అరగొండ ఆంజనేయుడు' గా ... 'కర్మన్ ఘాట్ ఆంజనేయుడు' గా ... 'నెట్టికంటి ఆంజనేయుడు' గా ఇలా ఎన్నో ప్రదేశాల్లో స్వయంభువుగా ఆవిర్భవించాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన క్షేత్రాల్లో మద్ది ఆంజనేయ క్షేత్రం ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ మధ్వ మహర్షి స్వామిని పూజించగా, ఆయనకి స్వామి ప్రత్యక్షంగా సేవలు చేసినట్టు స్థలపురాణం చెబుతోంది.
ఇక కరీంనగర్ జిల్లాకి చెందిన కొండగట్టులో ఎక్కడాలేని విధంగా స్వామి రెండు ముఖాలతో దర్శనమిస్తాడు. ఒకవైపు నరసింహస్వామి .. మరోవైపు హనుమంతుడు ముఖం కలిగిన ఈ మూర్తిని చూసి తీరవలసిందే. స్వామివారి మహిమకు నిలువెత్తు నిదర్శనంలా ఈ మూలమూర్తి దర్శనమిస్తుంది. ఇక కాకతీయుల కాలంలో వెలుగులోకి వచ్చిన కర్మన్ ఘాట్ ( హైదరాబాద్} హనుమంతుడి మహిమలు అనేకమని చెప్పవచ్చు.
చిత్తూరు జిల్లాకి చెందిన అరగొండ ఆంజనేయస్వామికి విషయానికి వస్తే, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకునివస్తూ ఉండగా, అందులోని కొంతభాగం ఇక్కడ పడిపోయిందట. అందుకే దీనిని అరగొండగా పిలుస్తుంటారు. ఆ తరువాత స్వామివారు ఇక్కడ ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనేక వ్యాధులను నివారించే క్షేత్రంగా ఇది అలరారుతోంది.
అనంతపురం జిల్లా కసాపురంలో గల నెట్టికంటి ఆంజనేయస్వామిని వ్యాసరాయలవారు ప్రతిష్ఠించారు. సాక్షాత్తు హనుమంతుడు ఆదేశంమేరకే ఆయన ఇక్కడ స్వయంభువు ప్రతిమను ప్రతిష్ఠించాడు. గుంటూరు జిల్లా 'కోళ్ళూరు' హనుమంతుడి విషయానికి వస్తే, దగ్గరుండి తన భక్తుడితో స్వామి తన మూర్తిని చెక్కించుకున్న వైనం ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇలా ఆయా క్షేత్రాల్లో స్వామివారు ఆవిర్భవించిన దగ్గర నుంచి ఆయన చూపుతోన్న మహిమలు అన్నీ ఇన్నీ కావు.
మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు హనుమంతుడికి ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది కాబట్టి, ఈ రోజున కొంతమంది హనుమంతుడి వ్రతాలు జరుపుతుంటారు. మరి కొంతమంది స్వామివారు వెలసిన ఇలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు ... ఆయన ఆశీస్సులతో ఆయురారోగ్యాలను పొందుతుంటారు.