దత్తాత్రేయుడి పూజకు ఈ పూలు శ్రేష్ఠం !
అత్రిమహర్షి - అనసూయాదేవి దంపతులకు త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయుడు, భక్తులపాలిట కామధేనువై ... కల్పవృక్షమై కరుణిస్తుంటాడు. దత్తాత్రేయుడు ఎవరికైనా సాయపడాలని అనుకున్నప్పుడు వాళ్లను తప్పనిసరిగా పరీక్షిస్తాడు. ఇందుకోసం స్వామి అనేక రూపాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయన మాయను తెలుసుకోవడం అసాధ్యమనడానికి అనేక సంఘటనలు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి.
తోటివారిపట్ల ... మూగజీవాలపట్ల సానుభూతి కలిగినవారిని స్వామి తప్పక కటాక్షిస్తూ ఉంటాడనే విషయం ఆయన భక్తుల అనుభవాలనుబట్టి తెలుస్తూ వుంటుంది. దత్తాత్రేయస్వామిని పూజించడం వలన కష్టాలు కనిపించకుండాపోతాయి. సిరిసంపదలు నిత్యనివాసం చేస్తాయి. ఆయన నామస్మరణమే ఒక ఔషధంలా పనిచేస్తుంది. అనారోగ్యాలను తొలగించి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.
అలాంటి స్వామిని ఆయన జయంతి రోజున పూజించడం వలన మరింత ప్రీతిచెందుతాడని అంటారు. సాధారణంగా ఒక్కో దైవానికి ఒక్కోరకం పూలు ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. భగవంతుడికి ప్రీతికరమైన పూలతో చేసే పూజ పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 'దత్త జయంతి' రోజున స్వామిని ఏ పూలతో పూజించాలనే సందేహం కొంతమంది భక్తులకు కలుగుతూ ఉంటుంది.
దత్తాత్రేయస్వామికి 'పసుపురంగు పూలు' ప్రీతికరమైనవి. అందువలన ఆయన పూజకు అవి శ్రేష్ఠమైనవి. ఈ రోజున ఆ స్వామిని పసుపురంగు పూలతో పూజించడం వలన సత్వరమే ఆయన అనుగ్రహం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.