అందుకే కర్ణుడు కవచంతో జన్మించాడు
ధైర్యసాహసాలకు ... స్నేహ ధర్మానికి నిలువెత్తు నిర్వచనంగా కర్ణుడిని చెబుతుంటారు. అలాంటి కర్ణుడు సహజసిద్ధమైనటువంటి కవచంతో జన్మించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. కవచంతో జన్మించడం వెనుక గల కారణాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంటుంది.
పురాణపరమైన ఆ కథనంలోకి వెళితే, పరమశివుడి గురించి కఠోర తపస్సు చేసిన ఒక రాక్షసుడు, మహా తపోబలసంపన్నులు తప్ప మరే శత్రువులు తనని సంహరించలేని విధంగా వెయ్యి కవచాలను వరంగా పొందుతాడు. ఆ వరబల గర్వంతో 'సహస్ర కవచుడు' సాధుసజ్జనులను హింసించసాగాడు.
అతని ఆటకట్టించడం కోసం నరనారాయణులు వంతులవారిగా .. ఒకరు తపస్సును ఆచరిస్తూ ఉంటే మరొకరు ఆ రాక్షసుడితో పోరాడసాగారు. అలా ఆ రాక్షసుడి కవచాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వెళతారు. ఇక ఒకే ఒక్క కవచం ఉండగా ప్రాణభయంతో ఆ రాక్షసుడు సూర్యదేవుడి ఆశ్రయాన్ని పొందుతాడు. ఆ సమయంలోనే సంతానం కోసం ప్రార్ధించిన కుంతీదేవికి సూర్యుభగవానుడు అతణ్ణి పుత్రుడిగా ప్రసాదిస్తాడు. అందువల్లనే కర్ణుడు కవచంతో జన్మిస్తాడు.
అయితే ఈ జన్మలోను ఆయన కృష్ణార్జునులుగా అవతరించిన నరనారాయణుల కారణంగా కురుక్షేత్ర సంగ్రామంలో మరణిస్తాడు. కర్ణుడి జీవితం ... ఆయనకి ఎదురైనా పరిస్థితులు ఎవరి మనసునైనా కదిలిస్తాయి. అయితే అధర్మమార్గంలో ప్రయాణిస్తోన్న దుర్యోధనుడిని ఆశ్రయించడం వలన కురుక్షేత్ర సంగ్రామంలో ఆయన కుప్పకూలిపోక తప్పలేదు.