ఆదుకునే దేవుడే రాఘవేంద్రుడు

ఆధ్యాత్మిక మార్గాన్ని సుసంపన్నం చేయాడానికి వచ్చిన కారణజన్ములలో రాఘవేంద్రస్వామి ఒకరు. భగవంతుడి ఆదేశానుసారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, ఆధ్యాత్మిక వైభవానికి ఆయన తనవంతు కృషిచేశాడు. తనని విశ్వసించిన భక్తులను ఆయన ఆదుకున్న ఘట్టాలు మహిమలుగా భక్తులు ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు.

రాఘవేంద్రస్వామివారి జీవితాన్ని పరిశీలిస్తే సాక్షాత్తు ఆయన భగవంతుడి స్వరూపమనే విషయం స్పష్టమవుతుంది. ఎందుకంటే భగవంతుడు తన భక్తులను ఎన్నిరకాలుగా ఆదుకుంటాడో, అన్ని రకాలుగా ప్రత్యక్షంగా భక్తులను ఆదుకున్న స్వామిగా రాఘవేంద్రుడు దర్శనమిస్తూ ఉంటాడు. మంత్రాలయ రాఘవేంద్రస్వామి ప్రభావం కారణంగా అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు నిర్మించబడి ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతున్నాయి.

అలాంటి ఆలయాలలో ఒకటి వరంగల్ జిల్లా కాజీపేట - పరిమళ కాలనీలో కనిపిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామి బృందావన రాఘవేంద్రుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. గురువారాల్లోను ... పర్వదినాల్లోను ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దుష్టశక్తుల వలన కలుగుతోన్న బాధలు ఇక్కడి స్వామిని దర్శించుకోవడం వలన దూరమవుతాయని చెబుతుంటారు.

మానసిక .. శారీరక రుగ్మతలు నివారించబడతాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు ... అకాలమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇందుకు నిదర్శనంగా వాటి బారినుంచి బయటపడినవాళ్లు ఇక్కడ కనిపిస్తుంటారు. అపారమైన విశ్వాసంతో ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశీస్సులు అందుకుంటూనే ఉంటారు. ఆయన అనుగ్రహాన్ని దివ్యమైన అనుభవాలుగా పొందుతూనే ఉంటారు.


More Bhakti News