హనుమకు ఆనందాన్ని కలిగించే నైవేద్యం
రావణసంహారం అనంతరం అయోధ్యకి తిరిగివచ్చిన రాముడు, తనకి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాడు. వాళ్లకు సంతోషం ... సంతృప్తి కలిగేలా కానుకలను అందజేస్తాడు. హనుమంతుడి వంతు రాగానే ఆయనని రాముడు గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు. ఆయన చేసిన సేవకి ... అందించిన సహకారానికి తాను ఏమిచ్చినా ఆ రుణం తీరదంటూ ఉద్వేగానికి లోనవుతాడు.
దీనిని బట్టి ఆయన రాముడికి ఎంతలా సేవచేశాడో అర్థంచేసుకోవచ్చు. అలాంటి హనుమంతుడు తన భక్తులను అనుగ్రహించడానికి అనేక ప్రాంతాలలో స్వయంభువుగా ఆవిర్భవించాడు. ఆ క్షేత్రాలన్నీ కూడా ఆ స్వామి మహిమలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హనుమంజ్జయంతితో పాటు మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కూడా ఆ స్వామి ఆలయాలలో భక్తుల సందడి కనిపిస్తుంది.
ఈ రోజున 'హనుమంతుడి వ్రతం' ఆచరించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. స్వామివారికి అరటిపండ్లు ... గోధుమపిండితో చేయబడిన అప్పాలు అంటే ఎంతో ఇష్టమట. అందువలన ఆయనకి అవి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అప్పాలను దండగా గుచ్చి కూడా ఆయన మెడలో వేస్తుంటారు.
ఆయనకి అవంటే అంత ప్రీతి కనుకనే ప్రతి మంగళవారం వీటిని సమర్పిస్తామని మొక్కుకునే భక్తులసంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా ఇష్టమైన నైవేద్యంతో స్వామిని సంతృప్తిపరచడం వలన ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పబడుతోంది. స్వామి అనుగ్రహం వలన గ్రహపీడలు తొలగిపోయి, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.