సమస్యలు తొలగించే సత్యదేవుడి క్షేత్రం

భక్తుడికి ఇచ్చిన మాట కోసం ... భక్తులను అనుగ్రహించడం కోసం సత్యనారాయణస్వామి అన్నవరంలో ఆవిర్భవించాడు. త్రిమూర్తి స్వరూపుడైన స్వామి మహిమలు అనేక ప్రాంతాలకు విస్తరించాయి. ఆ స్వామి దర్శనభాగ్యమే సమస్త దోషాలను తొలగించి సకలసంపదలను ప్రసాదిస్తుందనే విశ్వాసం భక్తులలో బలపడింది. దాంతో అనేక ప్రాంతాలలో స్వామి ఆలయాల నిర్మాణం జరిగింది.

అలా స్వామి కొలువుదీరిన ప్రాచీనక్షేత్రాల్లో ఒకటిగా 'హనుమకొండ' కనిపిస్తుంది. వరంగల్ జిల్లా హనుమకొండలో గల ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఇది ప్రాచీన వైభవానికి ప్రతీక అనే విషయం అర్థమైపోతుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో 'రమా సహిత సత్యనారాయణస్వామి' మహాతేజస్సుతో వెలుగొందుతూ దర్శనమిస్తూ ఉంటాడు. సకల శుభాలను ప్రసాదించే సత్యదేవుడిగా స్వామి ఇక్కడ కొలువుదీరిన తీరు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

అనేక ఆటంకాలను ... అనారోగ్యాలను తొలగించి ఆనందాన్ని ప్రసాదించే దైవంగా సత్యనారాయణస్వామి పట్ల భక్తులు అపారమైన విశ్వాసాన్ని కనబరుస్తుంటారు. ఈ కారణంగా ఇక్కడి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సత్యనారాయణస్వామి సన్నిధిలో ఆయన వ్రతాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్వామివారి దర్శనం కోసం వెళ్లిన వాళ్లు అక్కడ జరిగే వ్రతాలను చూడవచ్చు ... వ్రత కథలను వినవచ్చు ... ప్రసాదాన్ని స్వీకరించవచ్చు.

సత్యనారాయణస్వామి వ్రతం జరుగుతూ ఉండటం చూసినా .. వ్రత కథలు విన్నా ... ప్రసాదం స్వీకరించినా స్వామి అనుగ్రహం లభిస్తుందని చెప్పబడుతోంది. అందువలన సాధారణంగా ఇక్కడి దైవదర్శనానికి వచ్చిన భక్తులకు కూడా విశేషమైన పుణ్యఫలాలు అందుతూ ఉంటాయి. దర్శనమాత్రం చేతనే కష్టాలను తొలగించి సుఖశాంతులను అందించే స్వామిని భక్తులు విశేషంగా దర్శించుకుంటూనే ఉంటారు. అశేషంగా ఆయన ఆశీస్సులు అందుకుంటూనే ఉంటారు.


More Bhakti News