ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు

మహిమాన్వితమైనవిగా విలసిల్లుతోన్న పుణ్యక్షేత్రాల్లో 'సుచీంద్రం' ఒకటిగా చెప్పబడుతోంది. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఈ పవిత్ర క్షేత్రానికి 'సుచీంద్రం' అనే పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథనం స్థలపురాణంగా వినిపిస్తుంది.

ఆ కథనంలోకి వెళితే ... గౌతమమహర్షి భార్య 'అహల్య'ను పొందాలని దేవేంద్రుడు అనుకుంటాడు. తొలికోడి కూయగానే నదీ స్నానానికి వెళ్లడం గౌతముడికి అలవాటు. అది తెలుసుకున్న దేవేంద్రుడు, తెల్లవారకమునుపే కోడిలా కూస్తాడు. తెల్లవారిందనుకుని గౌతముడు నదికి వెళ్లగానే, ఆయన రూపంలో ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు.

తెల్లవారడానికి ఇంకా సమయముందని గ్రహించిన గౌతముడు ఆశ్రమానికి తిరిగివస్తాడు. అహల్యతో పాటు తన రూపంలో గల దేవేంద్రుడిని కూడా శపిస్తాడు. రాముడి పాదస్పర్శతో అహల్యకి శాపవిమోచనం జరుగుతుందని చెప్పిన గౌతముడు, త్రిమూర్తులు ఒకే చోట ఆవిర్భవించిన ప్రదేశానికి వెళ్లి వాళ్ల అనుగ్రహాన్ని సంపాదించమని దేవేంద్రుడికి సూచిస్తాడు.

అనసూయామాత పాతివ్రత్యాన్ని పరీక్షించిన త్రిమూర్తులు అక్కడ స్వయంభూలింగాలుగా ఆవిర్భవించారని తెలిసిన దేవేంద్రుడు ఆ ప్రదేశానికి వెళతాడు. తన తపస్సుచే త్రిమూర్తులను ఒప్పించి శాపవిమోచనాన్ని పొందుతాడు. దోషం నుంచి ... శాపం నుంచి ఇంద్రుడు 'శుచి' ని పొందిన చోటు కావడం వలన ఈ ప్రదేశానికి 'సుచీంద్రం' అనే పేరు వచ్చింది. అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరించే మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినా జన్మ తరించిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News