అమ్మవారు అనుగ్రహిస్తే అసాధ్యమైంది లేదు
జగన్మాత అనుగ్రహంతో 'వికటకవి' అనిపించుకున్న తెనాలి రామకృష్ణుడు, ఆ తల్లిని ఏ క్షణంలోనూ మరిచిపోయేవాడు కాదు. తాను ఏ కార్యాన్ని తలపెట్టినా అమ్మవారిని మనస్పూర్తిగా స్మరించుకుని ఆరంభించేవాడు. దాంతో ఆయన ఏ కార్యాన్ని తలపెట్టినా అది విజయవంతమవుతూ ఉండేది.
తనకి పాండిత్యాన్ని ప్రసాదించినది ... రాయలవారి కొలువులో ఉపాధి చూపించినది కూడా అమ్మవారేనని ఆయన భావించేవాడు. కేవలం కవిత్వానికి మాత్రమే ఆయన పరిమితం కాకుండా, విజయనగర క్షేమాన్ని ఆశించి పాలనా సంబంధమైన విషయాలలోనూ చురుకైన పాత్రను పోషించేవాడు.
ఒకసారి బహుమనీ సుల్తానులు విజయనగరంపై దండెత్తడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వాళ్లకి సైనిక సహాయాన్ని అందించడానికి మొఘల్ చక్రవర్తి అయిన బాబార్ అంగీకరిస్తాడు. బాబార్ తీసుకున్న నిర్ణయం సరైనదికాదని గ్రహించిన రామకృష్ణుడు, అమ్మవారిపై భారం వేసి ఆయనని కలుసుకుంటాడు.
బాబార్ ను ఒప్పించి బహుమనీ సుల్తానులకు సహాయంగా పంపించిన సైనిక బలగాలను వెనక్కి పిలిపిస్తాడు. దాంతో విజయనగర ప్రజలు తేలికగా ఊపిరి పీల్చుకుంటారు. రామకృష్ణుడి తెలివితేటలను ... ధైర్య సాహసాలను రాయలవారు ఎంతగానో అభినందిస్తాడు. తన తెలివితేటలకు ... ధైర్య సాహసాలకు అమ్మవారి అనుగ్రహం తోడుగా ఉండటం వల్లనే కార్యం విజయవంతమైందంటూ మనసులోనే ఆ తల్లికి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.