కోరల పౌర్ణమి రోజున ఎవరిని పూజించాలి ?
పాపపుణ్యాల ఫలితాలే స్వర్గనరకాల ప్రవేశాలకు కారణమవుతూ ఉంటాయి. ఎవరు ఆలయానికి వెళ్లినా ... పూజామందిరం దగ్గర కూర్చుని భగవంతుడిని ఆరాధించినా పుణ్యఫలాలను ప్రసాదించమనే. తెలియక చేసిన పాపాల నుంచి విముక్తిని కల్పించమనే. నిప్పు తెలిసి తాకినా తెలియక తాకినా కాలితీరుతుంది. అలాగే పాపమనేది తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల పాటు వెంటాడుతుంది.
పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అక్కడ జీవుడుపడే యాతన అంతా ఇంతా కాదు. అందుకే నరక బాధలను అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటూ ఉంటారు. మృత్యు భయం లేకుండా ఉండాలంటే ... నరకభాదలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని చెప్పబడుతోంది.
అందరి ప్రార్ధనను ఆయన ఆలకించి అనుగ్రహించే రోజుగా మార్గశిర పౌర్ణమి చెప్పబడుతోంది. దీనినే 'కోరల పున్నమి' గా పిలుస్తుంటారు. ఈ పున్నమి యమధర్మరాజుకి ఎంతో ప్రీతికరమైనదట. ఈ రోజున ఆయనని పూజించడం వలన శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు. యమధర్మరాజు అనుగ్రహమే ఉంటే నరక బాధలు తప్పుతాయి. నరక బాధల నుంచి తప్పించే పౌర్ణమి కావడం వలన దీనిని 'నరక పౌర్ణమి' గా కూడా భావిస్తుంటారు.
ఇక కోరల పున్నమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి, ఈ విధంగా చేయడం వలన ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని అంటారు. దంత సంబంధమైన దోషాలు ... వ్యాధులు రాకుండా ఉంటాయని విశ్వసిస్తుంటారు. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.