హనుమంతుడి దీక్ష ఇక్కడ ప్రత్యేకం !

సాధారణంగా కార్తీక .. మార్గశిర మాసాల్లో హనుమంతుడి భక్తులు ఆయన దీక్షను తీసుకుంటూ ఉంటారు. దగ్గరలోని హనుమంతుడి ఆలయాల్లో ఈ దీక్షను స్వీకరించడం ... మరింత విశిష్టమైన క్షేత్రానికి వెళ్లి దీక్ష విరమణ చేయడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏ హనుమంతుడి ఆలయంలో దీక్షధారణ జరిగిందో, అదే ఆలయంలో దీక్ష విరమణ చేయాలనే నియమం ఒక క్షేత్రంలో కనిపిస్తుంది.

ఇక ఇక్కడ దీక్ష తీసుకున్నవాళ్లు మండలకాలం పాటు ఇక్కడే ఉండాలనేది కూడా ఒక నియమంగా కనిపిస్తూ ఉండటం మరో విశేషం. ఇలాంటి నియమాలు కలిగిన హనుమంతుడి క్షేత్రం మనకి 'ఎర్రగట్టు' లో కనిపిస్తుంది. వరంగల్ జిల్లా హనుమకొండలో ఎర్రగట్టు దర్శనమిస్తుంది. ఎర్రగట్టు .. వేంకటేశ్వరస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం. ఇదే క్షేత్రంలో దాసాంజనేయుడు ప్రత్యేక ఆలయంలో కొలువై కనిపిస్తుంటాడు.

స్వామివారు కాకతీయుల కాలం కంటే ముందునుంచే ఇక్కడ కొలువుదీరి ఉన్నాడట. ఆ తరువాత ఒక భక్తుడికి స్వప్నంలో కనిపించి ఆదేశించిన కారణంగా ఆలయ నిర్మాణం జరిగిందని అంటారు. ప్రతి మంగళవారం స్వామివారికి సిందూర అభిషేకాలు ... ఆకుపూజలు జరుగుతుంటాయి. స్వామివారికి ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. హనుమజ్జయంతి ... మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున 'హనుమాన్ వ్రతం' ఘనంగా నిర్వహిస్తుంటారు.

భక్తులు ఇక్కడ హనుమాన్ దీక్షను చేపట్టడం ... ఇక్కడే ఉంటూ ఆ స్వామి భజనలు జరుపుతూ ఉండటం వలన ఆలయ వాతావరణం ఎంతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకోవడం వలన ... ఆ స్వామి దీక్షను చేపట్టడం వలన గ్రహపీడలు ... అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News