వివాహయోగాన్ని కలిగించే అమ్మవారు

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించింది. వివిధ నామాలతో పిలవబడుతూ ... వివిధ రూపాలతో కొలవబడుతోంది. అమ్మవారు ఆవిర్భవించిన ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

సాధారణంగా అమ్మవారి ఏ క్షేత్రాన్ని దర్శించినా సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని అంటారు. ఈ కారణంగానే ఆయా క్షేత్రాలు మహిళా భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకానొక క్షేత్రంలో కొలువైన అమ్మవారిని దర్శించడం వలన తప్పకుండా వివాహయోగం కలుగుతుందని చెబుతుంటారు. అంతగా భక్తుల విశ్వాసాన్ని పొందిన అమ్మవారుగా 'అవనాక్షమ్మ' దర్శనమిస్తుంది.

చిత్తూరు జిల్లా 'నారాయణ వనం' సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. అవనాక్షమ్మ తల్లి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో తెలియనివాళ్లు ఉండరు. వివాహం విషయంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కుంటున్న వాళ్లు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, అనతికాలంలోనే వివాహం జరిగిపోతుందని అంటారు. మహిమాన్వితురాలుగా చెప్పబడుతోన్న ఈ అమ్మవారు, పద్మావతీదేవి తండ్రి ఆకాశరాజు ఇలవేల్పుగా చెబుతారు.

పద్మావతీదేవి తన బాల్యం నుంచి ఇక్కడి అమ్మవారిని పూజిస్తూ ఉండేదట. శ్రీనివాసుడిపై మనసు పారేసుకున్న ఆమె, అమ్మవారి అనుగ్రహంతోనే ఆయనని భర్తగా పొందిందని అంటారు. పద్మావతీదేవి ... శ్రీనివాసుడు దర్శించుకున్న అమ్మవారిని మనం చూస్తున్నామనే భావన అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

పద్మావతీదేవి ఈ అమ్మవారిని ప్రార్ధించి కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందింది కనుక, ఈ అమ్మవారిని ఆరాధించడం వలన వివాహయోగం కలుగుతుందని విశ్వసిస్తుంటారు. అందుకు నిదర్శనంగా అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకునే కొత్త దంపతులు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే జాతరలో పాల్గొనే భక్తులను చూస్తే అమ్మవారి మహాత్మ్యం ... ఆమె పట్ల భక్తులకు గల విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నాయనేది స్పష్టమవుతుంది.


More Bhakti News