ఈ రోజున గురుచరిత్ర పారాయణ చేయాలి !
అనసూయాదేవి - అత్రిమహర్షి దంపతుల కోరికను మన్నించిన త్రిమూర్తులు, తమ అంశాలతో వారి బిడ్డగా జన్మిస్తారు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఆ బిడ్డకి 'దత్తాత్రేయుడు' గా నామకరణ చేస్తారు. దత్తాత్రేయుడు జన్మించిన 'మార్గశిర శుద్ధ చతుర్దశి' రోజు 'దత్తజయంతి' గా చెప్పబడుతోంది. ఈ రోజున దత్తాత్రేయస్వామిని భక్తిశ్రద్ధలతో పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
దత్తాత్రేయస్వామిని ఆపదకాలంలో ఏడుమార్లు పిలిస్తేచాలు, ఏడో మారు పిలిచే సమయానికి ఆయన అక్కడికి వచ్చేస్తాడు. అలాగే వివిధ రకాల వేషధారణలతో భక్తులను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ స్వామి పరీక్షలో నెగ్గితే చాలు ఇక ఆయన ఆ భక్తులను ఎలాంటి పరిస్థితుల్లోను వదిలిపెట్టడు. దేవతలకు ... మహర్షులకు సైతం జ్ఞానాన్ని బోధించిన శక్తిసామర్థ్యాలు దత్తాత్రేయస్వామి సొంతం.
అలాంటి దత్తాత్రేయస్వామిని ఈ రోజున పంచామృతాలతో అభిషేకించి పూజించాలి. స్వామికి ఎంతో ప్రీతికరమైనవిగా చెప్పబడుతోన్న అరటిపండ్లు ... రవ్వలడ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇక గురు సంబంధమైన లీలావిశేషాలను అద్భుతంగా ఆవిష్కరించిన 'గురుచరిత్ర'ను పారాయణ చేయాలి. వీలైతే పిఠాపురం ... గానుగాపురం వంటి దత్తాత్రేయస్వామి క్షేత్రాలను దర్శించాలి. లేదంటే దగ్గరలోని దత్తాత్రేయస్వామివారి ఆలయాలను దర్శించుకోవాలి.
శిరిడీ సాయినాథుడు గురుపరంపరలోని వాడిగా చెప్పబడుతున్నాడు కాబట్టి, అంకితభావంతో సాయినాథుడికి పూజాభిషేకాలు జరిపినా అదే విధమైన ఫలితం లభిస్తుంది. లోక కల్యాణం కోసం దత్తాత్రేయస్వామి జన్మించిన ఈ రోజున ఆ స్వామిని పూజించడం వలన ఆధ్యాత్మిక చింతనకు అవసరమైన జ్ఞానం లభిస్తుంది. కొండంత కష్టాలు కొవ్వొత్తిలా కరిగిపోతాయి. సమస్యలు మబ్బుతెప్పల్లా తేలిపోతాయి. ఆపదలు పక్కకి తప్పుకుంటాయి ... ఆనందాలు దరిచేరతాయి. ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు చేకూరతాయి.